Green Singal: తొలిసారి రోడ్డెక్కనున్న ఈ టిప్పర్‌.. పెట్రోల్, డీజిల్‌తో పని లేదట..!

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్) 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్‌ను పొందింది. ..

Update: 2023-03-01 10:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (ఓజీఎల్) 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్లకు హోమోలోగేషన్ సర్టిఫికెట్‌ను పొందింది. భారతీయ ఆటోమొబైల్ నియంత్రణ సంస్థల నుంచి ఈ సర్టిఫికెట్ పొందినట్లు సంస్థ వెల్లడించింది. కేంద్రీయ మోటారు వాహన నింబంధనలకు అనుగుణంగా.. ఒలెక్ట్రా 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ రోడ్డుపైకి వ‌చ్చేందుకు అవసరమైన అన్ని అనుమ‌తులు సాధించింది. ఒలెక్ట్రా త‌యారు చేసిన దేశంలోనే తొలి ఈ-టిప్పర్ మన రహదారులకు అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు, మైనింగ్, క్వారీతో సహా వివిధ ప్రాంతాల్లో పరీక్షలు చేసి సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు సంస్థ వెల్లడించింది.


ఒలెక్ట్రా ఈ-టిప్పర్లు హోమోలోగేషన్ సర్టిఫికెట్ పొందిన సందర్భంగా ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ. ప్రదీప్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలక్ట్రిక్ హెవీ వెహికల్ సెగ్మెంట్‌లో ఒలెక్ట్రా ప్రధాన పాత్ర పోషిస్తోందని, తమ సంస్థలో తయారైన ఈ-టిప్పర్ దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్‌గా నిలిచిందని చెప్పుకొచ్చారు. ఈ-టిప్పర్ ప్రోటోటైపును ఢిల్లీ, బెంగుళూరులో ప్రదర్శించామని.. ఇది ఔత్సాహికులకు గొప్ప ఉత్సుకతను, ఆసక్తిని కలిగించిందని స్పష్టం చేశారు. 20 ఎలక్ట్రిక్ ఈ-టిప్పర్ల మొదటి ఆర్డర్‌కు సంబంధించి ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు.

‘డీజిల్‌, పెట్రోల్ వాహ‌నాల‌తో పోలిస్తే ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ మొత్తం వ్యయం తక్కువ ఖర్చుతో కూడుకుంది. యజమానులు ఈ-టిప్పర్లను వాడ‌టం ద్వారా తమ నిర్వహణ లాభాలను మెరుగుపరచుకోవచ్చు. ఒలెక్ట్రా ఈ-టిప్పర్ మామూలు టిప్పర్ల మాదిరిగా శ‌బ్దాలు చేయ‌దు. కాలుష్యాన్ని విడుదల చేయ‌దు. పని ప్రదేశాల్లో దీనిని పగలు, రాత్రి తేడాలేకుండా ఉపయోగించుకోవచ్చు’ అని మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News