ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. ఆ జీతం చెల్లింపునకు హోంశాఖ నిర్ణయం
ఏపీ పోలీసులపై మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏపీ పోలీసులపై మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో స్పందించారు. పోలీస్ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పోలీసులను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా పని చేయించుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలపై పోలీసులతో అక్రమంగా కేసులు పెట్టించారని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు నచ్చని పోలీసులను వీఆర్‌కు పంపారని తెలిపారు. రెండేళ్లు, మూడేళ్లు జీతాలు ఇవ్వకుండా పోలీసులతో పని చేయించుకున్నారని తెలిపారు. వాళ్లకు జీత భత్యాలు చెల్లించుకునేందుకు తాము ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ను సైతం జగన్ ప్రభుత్వం మళ్లించిందని, కోర్టును కుంటి సాకులు చెప్పారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులు దాచుకున్న డబ్బులను ఇవ్వడానికి కూడా గత ఐదేళ్లలో జగన్‌కు మనసు రాలేదని హోంమినిస్టర్ అనిత విమర్శించారు. పోలీస్ కొత్త వాహనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. 50 శాతం పోలీస్ వాహనాల కొరత ఉందన్నారు. పోలీస్ వాహనాల ఆయిల్‌ను 120 నుంచి 300 లీటర్లకు పెంచుతామన్నారు. ఏపీఎస్పీ నుంచి ఏఆర్‌కు వెళ్లే పోలీసుల కన్వర్షన్ లిస్టు రెడీగా ఉందని, త్వరలో అ పని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిందని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని వంగలపూడి అనిత విమర్శించారు. గత ఐదేళ్లలో పోలీసుల సంక్షేమాన్ని జగన్ విస్మరించారని, కనీసం ఆ శాఖ బలోపేతంపై ఒక్క సారి కూడా దృష్టి పెట్టలేదని అనిత వ్యాఖ్యానించారు.