ఏపీ వ్యాప్తంగా జోరువానలు.. నదులకు పెరుగుతున్న వరద

తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాళహస్తి - తడ మార్గంలో భారీవర్షానికి రాకపోకలు స్తంభించాయి. స్వర్ణముఖి నదికి.. ఎగువప్రాంతాల నుంచి వరద పెరగడంతో.. నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

Update: 2024-10-16 07:40 GMT

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు ఇప్పటికే నీటమునిగాయి. నిన్న నెల్లూరు జిల్లా జలదంకిలో అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కావలిలో 33.9, ఇందుకూరుపేటలో 23, గుడ్లూరులో 20.5, లింగసముద్రంలో 19.8, వింజమూరులో 19.5, వరికుంటపాడులో 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరువాగు ఉద్ధృతిగా ప్రవహిస్తోంది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగుకు వరద పెరగడంతో.. పరిసర గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

మరోవైపు తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాళహస్తి - తడ మార్గంలో భారీవర్షానికి రాకపోకలు స్తంభించాయి. స్వర్ణముఖి నదికి.. ఎగువప్రాంతాల నుంచి వరద పెరగడంతో.. నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తిరుమల కనుమ రహదారుల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ అప్రమత్తమై.. శ్రీవారిపాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఇటు ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షం దంచికొడుతోంది. జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, పాదర్తి, రాజుపాలెం, మోటుమాల, గుండమాల, కె.పల్లెపాలెం, కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరులలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. తీరప్రాంత గ్రామాల్లోని ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిస్థితుల్ని, ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. తీరప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాలోనూ భారీవర్షం కురుస్తుండగా.. నేడు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తుండగా.. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 


Similar News