అకాల వర్షం.. అపార నష్టం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. కుప్పలుగా పోసిన మిర్చి తడిసి ముద్దైంది. వరి పైర్లు, మామిడి కాయలు నేలరాలాయి.

Update: 2023-04-27 02:09 GMT

దిశ, కర్నూలు ప్రతినిధి : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది. కుప్పలుగా పోసిన మిర్చి తడిసి ముద్దైంది. వరి పైర్లు, మామిడి కాయలు నేలరాలాయి. ఫలితంగా లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. బాధిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కర్నూలు నగరంతో పాటు ఎమ్మిగనూరు, దేవనకొండ, గోనెగండ్ల, ఓర్వకల్లు, సి.బెళగల్, నంద్యాల పరిధిలోని కొలిమిగుండ్ల, క్రిష్ణగిరి, మహానంది, సున్నిపెంట, ఆత్మకూరు మండలాల్లో భారీగా వర్షపాతం నమోదైంది.

ఎమ్మిగనూరులో చెట్లు కూలి ఇళ్ల మీద పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ కాలనీ, గాంధీనగర్, ఎన్ ఆర్ పేట, గాయత్రి ఎస్టేట్, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాలు వర్షపు నీటితో జలమయంగా మారాయి. బేతంచెర్ల, బనగానపల్లెలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలంలో మొక్కజొన్న, ఎండుమిర్చి తడిసిపోయాయి. మండలంలో దాదాపు 1,490 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. పరిహారం అందజేసి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News