బార్&రెస్టారెంట్‌లకు తాళాలు వేసిన వ్యాపారులు.. ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించిన వైనం

నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్ & రెస్టారెంట్‌ల యజమానులు మద్య నిషేధము మరియు ఆబ్కారీ స్టేషన్(ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ) అధికారుల పై తిరుగుబాటుకు దిగారు.

Advertisement
Update: 2025-03-22 14:59 GMT
బార్&రెస్టారెంట్‌లకు తాళాలు వేసిన వ్యాపారులు.. ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించిన వైనం
  • whatsapp icon

దిశ ప్రతినిధి, నరసరావుపేట: నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బార్ & రెస్టారెంట్‌ల యజమానులు మద్య నిషేధము మరియు ఆబ్కారీ స్టేషన్(ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ) అధికారుల పై తిరుగుబాటుకు దిగారు. పట్టణంలోని వైన్స్ లు బార్ల తరహాలో నడుపుతున్నారని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని దీనివల్ల తాము భారీగా నష్టాలను చవి చూస్తున్నామంటూ బార్ యజమానులు శనివారం తమ బార్& రెస్టారెంట్ లకు తాళాలు వేసి నిరసనకు దిగారు. ఎక్సైజ్ స్టేషన్‌కు వెళ్లి తాళాలు ఇవ్వడంతో ప్రోహిబిషన్ &ఎక్సైజ్ అధికారులకు మతిపోయినంత పనైంది.

బార్ అండ్ రెస్టారెంట్ షాపుల యజమానులు వ్యాపారం చేయలేమంటూ బహిరంగంగా మీడియా ముందు ప్రకటించిన పరిస్థితి నరసరావుపేటలో అటు వైన్స్ లు, ఇటు బార్ యాజమానుల మధ్య వైరంగా మారింది. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత బార్ అండ్ రెస్టారెంట్ షాపులు మరియు వైన్ షాపులకు టెండర్లు పిలిచి లైసెన్స్‌లు ఇచ్చిన విషయం విధితమే. నరసరావుపేటలో వైసీపీ హయాంలో మొత్తం 17 బార్ అండ్ రెస్టారెంట్లకు టెండర్లు ఆహ్వానించిన నేపథ్యంలో ఒక్కొక్క షాపుకు రూ.65 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు చెల్లించే విధంగా టెండర్లు వేసి దక్కించుకున్నారు. అదే సమయంలో నరసరావుపేట నియోజకవర్గం పరిధిలో 9 వైన్ షాపులకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి పాట ఎక్కువ మొత్తం పాడిన వారికి లైసెన్సులు మంజూరు చేసింది.

నరసరావుపేటలో వైన్ షాపులు నడుస్తున్న తీరు, అధికారులు పట్టించుకోక పోతుండటంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు క్లిష్ట పరిస్థితుల్లో పడ్డారు. ఆరు నెలలుగా వైన్ షాపుల కూడా యజమానులు నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా షాపులను బార్‌ల తరహాలో నిర్వహిస్తుండటంతో బార్ అండ్ రెస్టారెంట్ షాపుల వ్యాపారం దెబ్బ తింటూ వచ్చింది. ఈ వ్యవహారంపై బార్ యజమానులు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో రోడ్డున పడే పరిస్థితి ఎదురైందని బార్ యజమానులు వాపోయారు. దీంతో రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పట్టణంలోని అన్ని బార్ షాపులకు తాళాలు వేసి అధికారులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు.

బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు షాపులను తెరవకూడదని నిర్ణయించామని అధికారులకు తేల్చి చెప్పారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు చల్లా శ్రీనివాసరావు, సానికొమ్ము కోటిరెడ్డి, బి. నారాయణ, బెల్లంకొండ అనిల్, ఎస్ఎంఎస్ బుజ్జి తదితరులు ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసి తమ సమస్యలను మరోసారి వివరించారు. ఏటా రూ.65 లక్ష లైసెన్స్ కోసం ప్రభుత్వానికి చెల్లిస్తూ నష్టంతో వ్యాపారం చేసే పరిస్థితి నెలకొందని తాము నష్టాలు భరించే స్థితిలో లేమని ఎక్సైజ్ శాఖ సిఐ కే .సోమయ్యకు చెప్పారు.

ఓ బార్ అండ్ రెస్టారెంట్ యజమాని చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎక్సైజ్ శాఖ అధికారుల తీరు కారణంగా తాము భారీగా నష్టపోతున్నామని, తమపై ఆధారపడి ఉన్న 400 కుటుంబాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్పందించిన తీరు పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ, స్థానిక అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోంటున్నాం అన్నారు.

బి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం వైన్ షాపుల పాలసీ ప్రకారం బార్ అండ్ రెస్టారెంట్లు ఏమాత్రం దెబ్బతినకుండా ఉండేందుకు వైన్ షాపులకు పర్మిట్ రూములు లేకుండా లైసెన్సులు విడుదల చేసింది. అయితే అందుకు భిన్నంగా వైన్ షాపులో లైసెన్స్ దారులు 400 మంది కూర్చునే విధంగా ఏసీ సౌకర్యాలతో వ్యాపారం చేస్తున్నారన్నారు. దీని వల్ల బార్ అండ్ రెస్టారెంట్ దెబ్బతిన్నాయని అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తాళాలు తీసుకునేందుకు అధికారులు ఒప్పుకోలేదని, అయినప్పటికీ వ్యాపారాలు చేయలేమని స్పష్టంగా చెప్పమన్నారు. వైన్ షాపుల లైసెన్స్ దారులు నిబంధనలు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుకు నిరసనగా షాపులకు తాళాలు వేశామని బెల్లంకొండ అనిల్ తెలిపారు.

ఈ వ్యవహారం పై ఎక్సైజ్ సీఐ సోమయ్య మాట్లాడుతూ.. మద్యం వ్యాపారులు ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 60 కేసుల వరకు నమోదు చేశామని పేర్కొన్నారు..బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సమస్యలు 2 రోజుల్లో పరిష్కరిస్తామని సీఐ సోమయ్య బార్ యజమానులకు హామీ ఇచ్చినట్లు బార్ యజమానులు చెప్పారు. దీంతో బార్ & రెస్టారెంట్లు మధ్యాహ్నం నుంచి తెరిచారు. మొత్తం మీద నరసరావుపేట బార్& రెస్టారెంట్ యజమానులు తాళాలు వేసి నిరసనకు దిగత్మ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖలో కలకలం సృష్టించింది.

Similar News