కాజకు మహర్దశ..!
అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలోని కాజకు మహర్దశ పట్టనుంది....
దిశ ప్రతినిధి, గుంటూరు: అమరావతి రాజధాని ప్రాంతం మంగళగిరి నియోజకవర్గంలోని కాజకు మహర్దశ పట్టనుంది. కాజ వద్ద నేషనల్ హైవే-16 పై విజయవాడ పశ్చిమ, తూర్పు బైపాస్లు కలిసే చోట హాఫ్ క్లోవర్ జంక్షన్ ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్ హెచ్) ప్రతిపాదన సిద్ధం చేసింది. రెండు బైపాస్‌లు ఒకే దగ్గర కలిసే చోట హాప్ క్లోవర్ జంక్షన్ వల్ల ఈ ప్రాంతం కొత్త రూపును సంతరించుకోనుంది. రెండు బైపాస్‌ల మీదుగా వచ్చే ట్రాఫిక్, ఎన్ హెచ్-16 మీదుగా రాకపోకలు సాగించే ట్రాఫిక్ కు ఎక్కడా అవాంతరాలు కలగకుండా సాఫీగా సాగిపోవడానికి ఈ హాఫ్ క్లోవర్ జంక్షన్ దోహదపడుతుంది. దీని వల్ల కాజ, మంగళగిరి ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.
మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో..
ప్రస్తుతం ఆరు వరసలతో కూడిన జాతీయ రహదారిగా ఉన్న ఎన్ హెచ్-16కు చిన్న అవుటపల్లి నుంచి విజయవాడ పశ్చిమ బైపాస్ కాజ దగ్గర అనుసంధానమవుతుంది. చిన్న ఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ-శిలో 90 శాతం మేర, ప్యాకేజీ-4లో భాగంగా కృష్ణానది మీద బ్రిడ్జి, కాజ వరకు రోడ్డు పోర్షన్ పనులు 60 శాతం మేర పూర్తయ్యాయి. మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. పొట్టిపాడు నుంచి ప్రతిపాదిత తూర్పు బైసాస్ కూడా కాజ దగ్గర ఎన్ హెచ్-16కు కలవనుంది. ఈ రెండు బైపాస్ ఆరు వరసలతో నిర్మిస్తున్న నేపథ్యంలో.. కాజ ప్రాంతంలో హాప్ క్లోవర్ జంక్షన్ కంటే కూడా బటరై క్లోవర్ జంక్షన్ ఏర్పాటు చేస్తే బాగుటుందనే వాదన వినిపిస్తోంది.
బటర్ ఫ్లై క్లోవర్ జంక్షన్ అయితే మేలు..
ఆరు వరసలతో కూడిన బైపాస్‌లను అనుసంధానం చేసే చోట భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే బటర్ ఫై క్లోవర్ జంక్షన్ అవసరం తప్పకుండా ఏర్పడుతుంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి హరియాణా వరకు నిర్మించిన ద్వారకా ఎక్స్ ప్రెస్ వేలో ఇలాంటి బటర్ ఫ్లై క్లోవర్ జంక్షన్లు కనిపిస్తాయి. ఏపీ రాజధాని అమరావతి రానున్న రోజుల్లో విస్తృతమైన రోడ్ నెట్వర్క్ అనుసంధానం కానుంది. ఏపీలోనే అత్యంత భారీ వ్యయంతో కూడిన అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు కేంద్రం పచ్చ జెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు దిశగా కూడా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ నుంచి అమరావతికి ఆరు వరసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా.. కేంద్రం సానుకూలత తెలిపింది. బెంగళూరు-విజయ వాడ ఎకనామిక్ కారిడార్, నాగ్పూర్-విజయ వాడ ఎకనమిక్ కారిడార్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇవి రెండూ కూడా అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానమవుతాయి. వీటికి తోడు విజయవాడ- ఛత్తీస్ గడ్ (ఎన్ హెచ్ - 30), ఖమ్మం- విజయవాడ (ఎన్ హెచ్-216 హెచ్), కత్తిపూడి ఒంగోలు (ఎన్ హెచ్-216) వంటి వాటితోపాటు ప్రధానంగా ఎన్ హెచ్-16, ఎన్హెచ్-65లు అనుసంధానమవుతాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును తలపెడితే దీని నుంచి అవుటర్ రింగ్ రోడ్డుకు అనుసంధాన మార్గాలు ఉంటాయి. కాబట్టి విజయవాడ పశ్చిమ, తూర్పు బైపాస్‌లు ఆనుసంధానమయ్యే చోట హాఫ్ క్లోవర్ జంక్షన్ కంటే కూడా బటర్ ఫ్లై క్లోవర్ జంక్షన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.