Guntur: తాడేపల్లి గుండిమేడ ఇసుక రీచ్‌లో ఉద్రిక్తత.. జనసైనికుల అరెస్ట్
గుంటూరు జిల్లా తాడేపల్లి గుండిమేడ ఇసుక రీచ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది..
దిశ, డైనమిక్ బ్యూరో: గుంటూరు జిల్లా తాడేపల్లి గుండిమేడ ఇసుక రీచ్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇసుక రీచ్ అనుమతుల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. క్వారీలో ఇసుక రవాణా చేస్తున్న లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. పోలీసులు అండతోనే ఇదంతా జరుగుతుందని జనసైనికులు ఆరోపించారు. అయితే ఆందోళన చేస్తున్న జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు జనసేన నాయకులకు వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జనసైనికులను అరెస్ట్ చేశారు. నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనం ఎక్కించారు. అనంతరం జనసేన నాయకులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయితే పోలీసుల తీరుపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నా.. వారిని అడ్డుకోకుండా తమను అరెస్ట్ చేయడమేంటని మండిపడ్డారు. అనుమతుల గడువు ముగిసినా ప్రభుత్వ అండదండలతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో ఇసుకను అక్రమంగా అమ్ముకుని వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణాను జనసేన పార్టీ అడ్డుకుని తీరుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఇసుక అక్రమ దందాపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతామని తెలిపారు.