Ap News: సెంటు పట్టా పేరుతో వందల కోట్లు దోపిడీ..!

నాలుగేళ్ల జగన్ పాలనలో హింస, విధ్వంసం తప్ప అభివృద్ది శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు..

Update: 2023-06-15 13:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నాలుగేళ్ల జగన్ పాలనలో హింస, విధ్వంసం తప్ప అభివృద్ది శూన్యమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్లలో రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి నెట్టారని, లక్ష కోట్ల అప్పుల్లో ముంచారని ఆమె ఆరోపించారు. వైసీపీ వైఫల్యాలపై సమాధానం చెప్పటం చేతకాక చంద్రబాబు, పవన్, బీజేపీ‌పై విమర్శలు చేస్తూ వైసీపీ నేతలు ప్రజల దృష్టి మరల్చుతున్నారని మండిపడ్డారు. ‘అన్ని రంగాల్లో ఏపీ అథమ స్ధాయికి పడిపోయింది. గ్రామీణ స్వచ్చ సర్వేక్షన్ 2022లో ఏపీ 12 స్దానానికి పడిపోయింది. 729 జిల్లాలకు ర్యాంకులు ప్రకటిస్తే టీడీపీ హయాంలో...విశాఖ, తిరుపతి, విజయవాడ 5,6,7 స్దానాల్లో ఉంటే నేడు తిరుపతి స్థానం అట్టడుగుకు వెళ్లిపోయింది. మైనింగ్‌లో దోచుకోవటం తప్ప మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లా అభివృద్ధి పట్టదా?. నాడు నేడు అంటూ గొప్పలు చెప్పుకోవటం తప్ప విద్యారంగాభివృద్దికి మీరు చేసిందేంటి?. బడిమానేసిన విద్యార్థులు జాతీయ స్ధాయిలో 12 శాతం ఉంటే ఏపీలో 17 శాతం ఉన్నారు. నాడు-నేడు పేరుతో కమీషన్లు దండుకోవటం తప్ప విద్యారంగాభివృద్ధికి జగన్ చేసిందేంటి?, సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ మంత్రులకు ఉందా?.’ అని పంచుమర్తి అనురాధ నిలదీశారు.


వేసవికి గ్రామాల్లో తాగడానికి నీళ్లు లేక ప్రజలు పొలాల నుంచి తెచ్చుకుంటున్నారని పంచుమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలు పడుతున్న బాధలు కనిపించవా? అని ఆమె ప్రశ్నించారు. టూరిజం మంత్రి డ్యాన్సులేసి కాళ్లు విరగ్గొట్టుకోవటం తప్ప ఆ శాఖ అభివృద్ధి కోసం ఆమె చేసిందేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీ హయాంలో టూరిజంలో మొదటి స్ధానంలో ఉన్న ఏపీ నేడు 18వ స్థానానికి పడిపోయింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏపీ 13వ స్థానానికి దిగజారింది. పేదలు ఏపీలో ఎక్కువగా ఉన్నారని నీతి ఆయోగ్ సైతం చెప్పింది. 26 శాతం మందికి పౌష్టికాహారం అందట్లేదు. వైసీపీ ఆర్బాటంగా ప్రకటించిన గోరు ముద్ద పధకం ఏమైంది?. సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు రద్దు చేసి పేదల పొట్టకొట్టారు.’ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.

‘సెంటు పట్టా పేరుతో ప్రతి నియోజకవర్గంలో రూ. 100 నుంచి రూ 200 కోట్లు దోపిడీ చేశారు. నాలుగేల్లలో రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, పొదుపు శక్తి పూర్తిగా క్షీణిచింది, సంపద చక్రాన్ని విచ్చిన్నం చేశారు. బడుగు,బలహీన వర్గాల కోసం చంద్రబాబు నాయడు తెచ్చిన 83 పథకాలు జగన్ రద్దు చేశారు. చంద్రబాబు మహానాడులో ప్రకటించిన మినీమ్యానిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారు. ఆడబిడ్డల్ని మహాశక్తిగా రూపొందిచేందుకు మహాశక్తి పథకం తెచ్చాం. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 18- నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500, ఇంట్లో ఎంతమంది చదువకునే పిల్లలుంటే అందరికీ ఏడాదికి రూ. 15 వేలిస్తాం. యువతకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తాం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. కుళాయి ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తాం. పి -4 ఫార్ములాతో పేదల్ని ధనికులుగా చేస్తాం. రాబోయేది పేదల ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వమే.’ అని పంచుమర్తి అనురాధ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News