తెనాలి టీడీపీలో అలజడి.. కార్యకర్తల ఆత్మహత్యాయత్నం (video)
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ, జనసేనకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీ, జనసేనకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల తమ నేతలకు సీట్లు ఇవ్వాలంటూ కొందరు కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలా జరకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని అలజడి సృష్టిస్తున్నారు.ఇలాంటి ఘటన తాజాగా తెనాలి తెలుగుదేశం పార్టీ సమావేశంలో జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున అలపాటి రాజా, జనసేన నుంచి నాదెండ్ల మనోహన్ కీలక నేతలుగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు వస్తుందో తెలియదు గానీ.. ఇప్పటి నుంచే నిరసన సెగలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత అలపాటి రాజాకే పొత్తులో భాగంగా సీటు ఇవ్వాలని ఆ పార్టీ నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కార్యకర్తలు పట్టుబట్టారు. అంతేకాదు ఆందోళనకు దిగారు. అలపాటికి సీటు ఇవ్వాల్సిందేనని నినాదాలు చేశారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై ఆత్మహత్యాయత్నానికి యత్నించారు. అలపాటి రాజాకు సీటు ఇవ్వకపోతే తాము చనిపోతామని హెచ్చరించారు. దీంతో టీడీపీ సర్వసభ్య సమావేశం గందరగోళంగా మారింది. పెట్రోల్ పోసుకున్న కార్యకర్తలను మిగిలినవారు అడ్డుకోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. కానీ అలపాటి రాజాకు సీటు ఇవ్వకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుందని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారు. మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన కార్యకర్తలకు ఆయా పార్టీల అధినేతలు ఎలాంటి సూచనలు చేస్తారో చూడాలి.