TDP: ఫేక్ వీడియోలు.. మన్విత్ కృష్ణారెడ్డిపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీపై ఫేక్ వీడియోతో దుష్ప్రచారం చేసిన మన్విత్ కృష్ణారెడ్డిపై సీఐడీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీపై ఫేక్ వీడియోతో దుష్ప్రచారం చేసిన మన్విత్ కృష్ణారెడ్డిపై సీఐడీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. సీఐడీ ఛీప్‌ను తన కార్యాలయంలో కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అడిషనల్ డీజీ విజయకుమార్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేశారు. బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, హెచ్.ఆర్.డి సభ్యులు ఎస్.పి సాహెబ్‌లతో కలిసి ఫిర్యాదు చేశారు. ఫేక్ వీడియోలతో వైసీపీ సోషల్ మీడియా సభ్యులు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా రామాల మన్విత్ రెడ్డి.... కృష్ణ చౌదరి అనే పేరుతో టీడీపీ కార్యకర్తలా ఫేక్ వీడియో విడుదల చేసి టీడీపీపై దుష్ప్రచారం చేశారు అని ఆరోపించారు. మన్విత్ కృష్ణారెడ్డి కరుడుగట్టిన వైసీపీ మద్దతుదారుడని ఆరోపించారు.
టీడీపీ గుర్తులను, చంద్రబాబు నాయుడు ఫోటోలను బ్యాక్ డ్రాప్‌లో వాడుకుని ఫేక్ వీడియో రూపొందించాడని ఫిర్యాదులో వర్ల పేర్కొన్నారు. ప్రాంతీయ విధ్వేషాలు, వివిధ కులాలు, సామాజిక వర్గాలలో టీడీపీపై వ్యతిరేకత వచ్చేలా వీడియో చేసి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కులాలను, కులవృత్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నాయకుడి వేషంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నట్లు ప్రజలను నమ్మింపచేసేలా మన్విత్ కృష్ణారెడ్డి వీడియోలో మాట్లాడాడని సీఐడీకి ఫిర్యాదు చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి సిద్ధహస్తుడు అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఇటువంటి తప్పుడు వీడియోలు ప్రచారం చేయడంలో రాజకీయ కుట్ర దాగి ఉంది. మన్విత్ కృష్ణారెడ్డితో పాటు తప్పుడు వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు.