Big Twist: జనసేన దిమ్మె ధ్వంసం వెనుక మొత్తం స్టోరీ ఇదే..!

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య ఆదిపత్య పోరు తారా స్థాయికి చేరింది....

Update: 2023-05-25 13:28 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. అది ఎంతగా అంటే ఒక వర్గం నిర్మించిన పార్టీ దిమ్మను మరో వర్గం ధ్వంసం చేసేంతగా పరిస్థితులు నెలకొన్నాయి. సత్తెన‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఇక్కడ మూడో స్థానంలో ఉన్న జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల నాటికి సత్తా చాటాలని చూస్తోంది. సత్తెనపల్లి జనసేన పార్టీ ఇంచార్జిగా ఉన్న యర్రం వెంకటేశ్వర రెడ్డి ఇటీవల వైసీపీలో చేరిపోయారు. దీంతో జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఒక్కసారిగా చెలరేగింది. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.

సత్తెనపల్లిలో శ్రీనివాస్, బొర్రా అప్పారావు జనసేన పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా వీరే చూస్తారు. ఇక జనసేన అధినేత అధినేత పర్యటన ఉందంటే ఈ ఇద్దరు నేతలే కీలకంగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి వెళ్లినప్పటికి నుంచి తిరిగి పయనం అయ్యే వరకు కూడా అన్ని తామే అయ్యి చూసుకుంటారు. పవన్ సభలకు జనాన్ని సేకరించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు కూడా చేస్తారు. అది అంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు మాత్రం ఈ ఇద్దరి నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. శ్రీనివాస్, బొర్రా అప్పారావు వర్గీయులు పార్టీ కార్యక్రమాలు కూడా విడివిడిగా నిర్వహించుకుంటున్నారు.


ఇదిలా ఉంటే సత్తెనపల్లి పట్టణంలో జనసేన పార్టీ జెండా దిమ్మను ఏర్పాటు చేశారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరుపయోగంగా ఉన్న లోక్ సత్తా పార్టీ జెండా దిమ్మెకు రంగులు వేసి జనసేన చిహ్నాలతో జనసేన దిమ్మెను నిర్మించారు. ఇందుకు మున్సిపల్ అధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే జనసేన దిమ్మెను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో స్థానిక జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరోవైపు జనసేన నాయకులు శ్రీనివాస్, బొర్రా అప్పారావు వర్గీయులు మాత్రం పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. జనసేన పార్టీ దిమ్మెను ధ్వంసం చేసింది శ్రీనివాస్ వర్గీయులని బొర్రా అప్పారావు వర్గీయులు చెబుతున్నారు. బొర్రా అప్పారావు వర్గీయులే తమ పార్టీ దిమ్మెను ధ్వంసం చేశారని శ్రీనివాస్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇద్దరి నేతల మధ్య వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందని స్థానిక విశ్లేషకులు అంటున్నారు. ఇకనైనా జనసేన పార్టీ నాయకులు కలిసి కట్టుగా పని చేస్తేనే సత్తెన పల్లిలో గెలుపు ఈజీ అవుతుందని లేదంటే గత అనుభవమే ఎదురవుతోందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ పై ఘాటు విమర్శలు చేసే అంబటి రాంబాబును ఎదుర్కోవాలంటే ఆ పార్టీ అధినేత ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసముందని అంటున్నారు. మరి సత్తెనపల్లిలో నెలకొన్న ఆధిపత్య పోరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News