పనికిమాలిన మంత్రులతో పరిశ్రమలు ఎలా వస్తాయి?:నారా లోకేష్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు అడ్డగోలు సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదు,పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని మంత్రిని అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతారు.
దిశ ప్రతినిధి,గుంటూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు అడ్డగోలు సంపాదనపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ లేదు,పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని మంత్రిని అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతారు. ఇటువంటి పనికిమాలిన మంత్రులుంటే పరిశ్రమలు ఎలా వస్తాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లి పూజిత అపార్ట్ మెంట్ వాసులతో యువనేత లోకేష్ శనివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ..ఆనాడు 5వేల ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు కడతానంటే అంత భూమి ఎందుకన్నారు, విజన్ – 2020 అని అంటే ఎగతాళి చేశారు. ఈరోజు ప్రపంచంలోనే మేటి నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. నాయకుడు అంటే చంద్రబాబులా విజన్ ఉండాలని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు, అయినా కరెంటు కోతలు తప్పడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా చార్జీలు పెంచకుండా నిరంతర విద్యుత్ అందజేశాం. కనీసం కరెంటు కూడా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాన్ని చూసి పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా వస్తాయి?
లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోని పూజిత అపార్ట్‌మెంట్ లో కరెంటు పోయింది. కరెంటు పోయిందా?కావాలనే తీసేసారా..? అనే చర్చ సమావేశానికి హాజరైన వారిలో జరిగింది. చంద్రబాబు సీఎం అయ్యాక టెస్లా లాంటి ప్రఖ్యాత కంపెనీలను రాష్ట్రానికి రప్పించి ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నాం. ఒక్క ఛాన్స్ పేరుతో అయిదేళ్ల క్రితం అధికారం చేపట్టిన జగన్... ప్రజావేదిక విధ్వంసంతో పాలన ప్రారంభించారు. నేటికీ ఆ శిథిలాలు అలాగే ఉన్నాయి. జగన్ అనాలోచితంగా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుని మూడుముక్కలాట ఆడారు. రుషికొండను ధ్వంసం చేసి విశాఖలో 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు.
అక్కడ నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించిన ఎన్ జి టి రూ.200 కోట్ల ఫైన్ చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఎన్‌జీటీ నిబంధనల మేరకు ఇప్పుడు ఆ కట్టడంలో సగభాగాన్ని తొలగించాల్సి ఉంది. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలు. ప్రస్తుతం రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఉద్యోగులకు రూ.25వేల కోట్ల బకాయిలు పెట్టారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తాం. ఏడాది వ్యవధిలో వారి బకాయిలన్నింటినీ చెల్లించే ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులను రాష్ట్రాభివృద్ధి లో భాగస్వాములను చేస్తామని యువనేత లోకేష్ పేర్కొన్నారు.
Read More..