AP News: 'పిన్నెల్లి కాలి గోరు కూడా పీకలేరు'

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించే శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకుగానీ, ఆయన ఇన్‎చార్జిగా పెట్టిన బ్రహ్మారెడ్డికి కానీ లేవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ..

Update: 2022-12-17 13:27 GMT
  • చంద్రబాబు, బ్రహ్మారెడ్డి హత్యా రాజకీయాలను చూస్తూ ఊరుకోం
  • రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించే శక్తిసామర్థ్యాలు చంద్రబాబుకుగానీ, ఆయన ఇన్‎చార్జిగా పెట్టిన బ్రహ్మారెడ్డికి కానీ లేవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించలేమన్న బెంగతో ఏకంగా అంతమొందించేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. మాచర్ల ఘటనలో గాయపడిన వైసీపీ కార్యకర్తలను నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రిలో మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేశ్‌రెడ్డి పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ చంద్రబాబు హత్యా రాజకీయాలు, కుట్ర రాజకీయాలను చూస్తూ ఊరుకోమని, వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి నేర చరిత్ర ఏమిటో, అతను ఎన్ని హత్యలు చేశాడో మాచర్ల ప్రజలకు తెలుసునన్నారు. చంద్రబాబు, బ్రహ్మారెడ్డిలు ఎన్ని కుట్రలు చేసినా, హత్యా రాజకీయాలు చేసినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కాలి గోరు కూడా పీకలేరని అంబటి చెప్పుకొచ్చారు. ఇదేం ఖర్మ అంటూ.. పల్నాడు ప్రాంతానికి ఇటీవల వచ్చిన చంద్రబాబు ఎటువంటి వ్యాఖ్యలు చేశారని అంబటి ప్రశ్నించారు.'నేను కన్నెర్ర చేస్తే పల్నాడులో ఒక్కడు ఉంటాడా..?'అంటూ పల్నాడును తిరిగి రావణకాష్టం చేసేలా, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడింది నిజం కాదా అని నిలదీశారు. చంద్రబాబు రెచ్చగొట్టిన ఆ వీడియోలు యూ ట్యూబ్‌లో ఇప్పటికీ ఉన్నాయని గుర్తు చేశారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడానికి సీఎం కుర్చీలో ఉంది చంద్రబాబు కాదని.. ఆ కుర్చీలో ఉన్నది జగన్ అన్నది తెలుసుకోవాలన్నారు. జగన్ ప్రభుత్వంలో తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు.

Tags:    

Similar News