ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: Nadendla Manohar

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లక్కనపల్లెలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన నాయకుడు మదుసూదన్‌పై దాడి చేయడాన్ని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు..

Update: 2023-10-08 12:23 GMT

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లక్కనపల్లెలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన నాయకుడు మధుసూదన్‌పై వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక దాడులు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గడప గడపకు దాడులు కార్యక్రమంలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను గుర్తించిన ప్రజలు వైసీపీ వాళ్ల‌ను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టించడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్కనపల్లెలో ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన నాయకుడు మధుసూదన్‌పై దాడి చేయడం అప్రజాస్వామకమన్నారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లోని తప్పులను గుర్తించి అడగమే ఆ బాధితుడు చేసిన తప్పా అని నిలదీశారు. వైసీపీ చేస్తున్న తప్పులు బయటపడుతున్నాయి కాబట్టే అసహనంతో దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు తక్షణమే స్పందించి మధుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లకు గడప గడపలో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించేటప్పుడు గృహ నిర్బంధాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News