మంత్రి సొంత నియోజకవర్గంలో విష జ్వరాలు. టీడీపీ నేత పుల్లారావు తీవ్ర ఆగ్రహం
మంత్రి విడుదల రజినీపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: మంత్రి విడుదల రజినీని గుంటూరు వైసీపీ ఇంచార్జిగా అధిష్టానం నియమించింది. దీంతో గుంటూరులో కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఆమె కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే చిలకలూరిపేట నియోజకవర్గంపై ఆమె దృష్టి సారించడంలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకు కారణం నియోజవకర్గంలో నెలకొంటున్న సమస్యలే. ఇటీవల కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో విషజ్వరాలు విజృంభించాయి. దీంతో కనపర్రు గ్రామంలో వందలమంది ప్రజలు విషజ్వరాల బారిన పడి మంచాలకే పరిమితమయ్యారు. ఎమ్మల్యే విడుదల రజినీ అందుబాటులో లేకపోవడంతో అటు వైద్యులు సైతం పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసరమయినా తూతూ మంత్రంగా వైద్యం అందిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రి విడుదల రజినీ తీరుపై ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
తాజాగా మంత్రి విడుదల రజినీపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య శాఖ మంత్రికి సొంతనియోజకవర్గల ప్రజల కష్టాలు పట్టవా అంటూ ప్రశ్నించారు. తన విధులు మరిచి పోయి పూర్తిగా జగన్ భజనశాఖ మంత్రిగా ఆమె మారిపోయారని ఎద్దేవా చేశారు. కనపర్రులో వందలవంది విషజ్వరాలతో మంచం పట్టినా స్థానిక ఎమ్మెల్యేగా వారిని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆరోగ్య శాఖను ఆమె పూర్తి అనారోగ్య శాఖగా మార్చారని మండిపడ్డారు. తద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల కష్టాలు పట్టించుకోవాలని పుల్లారావు సూచించారు.