గుంటూరులో మాయగాళ్లు.. 57 మందికి టోకరా..!

ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 57 మందిని మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...

Update: 2024-10-07 02:46 GMT

దిశ, మంగళగిరి: ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సుమారు 57 మంది నుంచి రూ.14 కోట్లు మోసగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు గుంటూరు నగరంలోని పలకలూరు రోడ్డుకు చెందిన సూరబత్తుని కృష్ణ చైతన్యకు చెందిన విష్ణు ఓవరసీస్ కన్సల్టెన్సీ సంస్థను ఆశోక్ నగర్‌లో గతేడాది ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రారంభించారు. అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడైన కృష్ణ చైతన్య, గుంటూరు ఆకులవారితోటకు చెందిన లక్ష్మీశెట్టి జయరామ్, నాదెండ్ల మండలం సాతూలూరుకు చెందిన ఈదర మనోహర్ కీలక పాత్రధారులుగా, అమరావతి మండలం నరుకుపాడుకు చెందిన కొంగర గోపికృష్ణ, ఈదర మనోహర్‌లు ఏజెంట్లుగా వ్యవహరించారు.

వీసాల పేరుతో మోసం..

బ్రిటన్‌లో జాబ్ వీసాలు ఇప్పిస్తామని వీరు నయవంచనకు తెరలేపినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బ్రిటన్‌లో గోపికృష్ణ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడని అన్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డుకు చెందిన ఎడ్వీన్ విలియమ్ శామ్ రిచర్డ్స్ రూ.23 లక్షలు, నెల్లూరు పద్మావతి సెంటర్‌కు చెందిన కర్రెద్దుల శరత్ చంద్ర రూ. 8 లక్షలు చెల్లించి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్లకు చెందిన అనిల్ రెడ్డి రూ.18 లక్షలు చెల్లించగా, రెండ్లు సార్లు ఫేక్ జాబ్ లెటర్‌తో జాబ్ వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని తిరస్కరించిన బ్రిటన్ ప్రభుత్వం అతని పాస్ పోర్టును 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. బాధితులలో తెలంగాణ మంగపేట, దిల్షూక్ నగర్, సారూర్ నగర్ మోహబూబాబాద్, పిడుగురాళ్ల, నరుకులపాడు, ఒంగోలు, కొత్తపల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు.

డబ్బులు అడిగితే బెదిరింపులు

బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడంతో, గత వైసీపీ ప్రభుత్వంలో బడా నాయకుల నుంచి బెదిరింపులతో పాటు తమపైనే పోలీసు ఫిర్యాదులు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. కాగా, బాధితులను ఆర్దికంగా మోసగించిన నిందితుడు ఎస్పీ గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేయడం కొసమెరుపు. జరిగిన మోసంపై బాధితులు మంత్రి, నారా లోకేశ్, హోం మినిస్టర్ వంగలపూడి అనిత దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. బ్రిటన్‌లో జాబ్ వీసాలు ఇప్పిస్తామని ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారిపై సమగ్ర విచారణ జరిపితే కీలక నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Similar News