ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు.. సభ్యులు ఎవరో తెలుసా..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఈ సిట్ పని చేయనుంది. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత పని చేయనున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్ స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ సభ్యులుగా నియామకమయ్యారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను రెడీ చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అల్లర్ల కారకులపై కఠిన శిక్షలు అమలు అయ్యే అవకాశాలున్నాయి.
కాగా రాష్ట్రంలో పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సైతం అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించారు. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read More..