దిశ ఎఫెక్ట్: విశాఖ జేసీఎల్ గణేషన్‌పై చర్యలు
మంత్రి గుడివాడ అమర్నాధ్ అండ చూసుకొని పరవాడ ఫార్మాసిటీలో ప్రతి కంపెనీ నుంచీ పాతికవేల రూపాయలు వసూలు చేసిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎ.గణేషన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకొంది....
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మంత్రి గుడివాడ అమర్నాధ్ అండ చూసుకొని పరవాడ ఫార్మాసిటీలో ప్రతి కంపెనీ నుంచీ పాతికవేల రూపాయలు వసూలు చేసిన కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎ.గణేషన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఆయన్ను సెలవులో పంపించింది. 'అమర్నాధ్ ఆగడాలు.. పోలింగ్‌కు ముందు వ్యాపారులకు వేధింపులు.. ఎలక్షన్ ఫండ్ పేరిట బలవంతపు వసూళ్లు.. గుడివాడ అండతో రెచ్చిపోతున్న ఇన్చార్జి డీసీఎల్ ' అన్న శీర్షికన 'దిశ’ ఈ నెల 11న పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే.
స్పందించిన కమిషనర్..
ఈ వార్తకు కమిషనర్ శేషగిరిబాబు స్పందించి గణేషన్‌ను సస్పెండ్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే గణేషన్ కాళ్ళావేళ్ళా పడి బతిమిలాడు కోవడంతో సెలవుపై వెనక్కు పంపించినట్టు తెలుస్తోంది. తనకు తీవ్రమైన నడుంనొప్పి వున్నందువల్ల మే 14 నుంచి 31వ తేదీ వరకూ మెడికల్ గ్రౌండ్స్‌లో సెలవు కావాలని గణేషన్ దరఖాస్తు చేసుకున్నాడు. అది కూడా సగం జీతానికి సెలవు కావాలని కోరుకున్నారు. అయితే సెలవు దరఖాస్తును పెండింగ్‌లో పెట్టి గణేషన్ విజయవాడలో చేస్తున్న పోస్టులో ఐ.మాధవిని నియమించారు. గణేషన్ విజయవాడలో ఏపీబీ అండ్ ఓసీడబ్ల్యూడబ్ల్యూబీకి డిప్యూటీ సీఈఓగా పని చేస్తూ ఎన్నికల సమయంలో ఎన్నికల డ్యూటీ పడకుండా మేనేజ్ చేసుకొని మరీ విశాఖకు ఇన్ఛార్జిగా వచ్చారు. విశాఖలో పలు పరిశ్రమలున్నందున భారీగా వసూళ్లు చేసుకొనే ఆలోచనతో ఇక్కడ హడావుడిగా వసూళ్లు ప్రారంభించి ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు విశాఖలో జాయింట్ లేబర్ కమిషనర్ గణేషన్ స్థానంలో ఎస్.లక్ష్మీ నారాయణకు పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. లక్ష్మీనారాయణ ఇప్పటికే విజయవాడ లేబర్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.