సుంకేశులకు భారీగా వరద ప్రవాహం.. ప్రజలకు అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
తుంగభద్ర నుంచి సుంకేశులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది...
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ వరద ప్రవాహంలో కొట్టుపోయిన విషయం తెలిసిందే. హోస్పేట వద్ద చైన్ లింక్ తెగిపోయింది. వెంటనే వరద ప్రవాహంలో ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో వృథాగా నీరు కిందకు పోతోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. నీటి వృథా కాకుండా తాత్కాలికంగా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టనుంది. డ్యామ్ నుంచి వృథాగా పోతున్న నీటిని ఐరన్ షీట్ల ద్వారా కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తుంగభద్ర డ్యామ్ వద్దకు నిపుణుల టీమ్ వెళ్లారు. ప్రతి రోజూ 9 టీఎంసీల చొప్పున డ్యామ్ నుంచి 60 టీఎంసీల నీటిని ఖాళీ చేయాలని నిర్ణయించారు. అనంతరం కొత్త గేటు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తుంగభద్ర నుంచి సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల నీరు చేరింది. గేటు మరమ్మతులు చేసే వరకూ సుంకేశులకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కర్నూలు జిలాల్లో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.