ఏపీలో గంజాయి కలకలం
ఏపీలో మరోసారి గంజాయి పెనుభూతం కలకలం సృష్టించింది. విజయవాడలోని కృష్టవరం టోల్‌ప్లాజా వద్ద టీఆర్ఐ సోమవారం తనిఖీలు నిర్వహించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరోసారి గంజాయి పెనుభూతం కలకలం సృష్టించింది. విజయవాడలోని కృష్టవరం టోల్‌ప్లాజా వద్ద టీఆర్ఐ సోమవారం తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రెండు వాహనాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం రూ.1.61 కోట్ల విలువైన 808 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉంటే విజయవాడలో ఇటీవల గంజాయి పట్టివేత కేసులు పెరుగుతున్నాయి. రెండు నెలల క్రితం మాచవరం, సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 90.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ బైక్ సీజ్ చేశారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి మత్తుని వదిలించేందుకు విజయవాడ కమిషనరేట్ పరిధిలో సీపీ రామకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏసీపీ ఆధ్వర్యంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసి జోన్ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి రవాణాని నియంత్రించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.