జగన్ రెడ్డిలో ఫ్రస్టేషన్ పీక్ : యనమల రామకృష్ణుడు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడిని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఖండించారు. వైఎస్ జగన్ రెడ్డి రౌడీ రాజకీయానికి ఈ దాడులు పరాకాష్ట అని మండిపడ్డారు.

Update: 2023-04-22 07:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడిని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఖండించారు. వైఎస్ జగన్ రెడ్డి రౌడీ రాజకీయానికి ఈ దాడులు పరాకాష్ట అని మండిపడ్డారు. చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ రెడ్డిలో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందని అందువల్లే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు జగన్ రెడ్డినే ఆదర్శంగా తీసుకుంటున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతకైనా బరితెగించి నీచ రాజకీయాలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు పర్యటనలో దాడి జరిగే అవకాశం ఉంది, భద్రత పెంచమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ...డీజీపీ, ప్రకాశం జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వక లేఖలు రాసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు? ప్రతిపక్షనేతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిపై దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూడ్డమేంటి? పోలీసులు ఉన్నది ప్రజల కోసమా? జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగడానికా? అని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ అర్ధనగ్న ప్రదర్శన చూస్తే ప్రజాస్వామ్యంమే సిగ్గుపడుతోంది. జగన్ రెడ్డి మెప్పు కోసం మరీ ఇంతలా దిగజారాలా? తాడేపల్లి ప్యాలెస్, ఐ ప్యాక్ చెప్పిన దానికల్లా తలూపుతున్న ఆదిమూలపు సురేశ్ యావత్ దళితులకు తలవంపులు తెచ్చారు అని విరుచుకుపడ్డారు. నలుగురికి మంచీ, చెడు చెప్పాల్సిన మంత్రే నడిరోడ్డుపై బట్టలూడతీసుకుని రచ్చ చేయడం దేనికి సంకేతం? మీ చదువు మీకు నేర్పింది ఇదేనా సురేశ్ ? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలనలో నాలుగేళ్లుగా దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించికోని ఆదిమూలపు సురేశ్ అదే దళితుల హక్కుల కోసం పోరాడుతున్న చంద్రబాబుపై విషం చిమ్మడం దుర్మార్గమన్నారు.

జగన్ రెడ్డి రౌడీ రాజకీయాలతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటే అదే పగటి కలే అవుతుంది అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి కోడికత్తి డ్రామాలకు భయపడేవాళ్లు ఇక్కడెవరూ లేరు అని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో నియంతల ఆగడాలు సాగవు. జగన్ రెడ్డిలా ఎగిరెగిరి పడిన ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. జగన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలు కూడా ఆలోచన చేయాలి అని పిలుపునిచ్చారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది..ప్రజల మద్దతుతో రాక్షస పాలనకు చరమగీతం పలుకుతాం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు.

Tags:    

Similar News