సొంత ఇళ్లు లేని వారికి మాజీ CM చంద్రబాబు గుడ్ న్యూస్
సొంత ఇళ్లు లేని వారికి టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పాయకరావుపేటలో
దిశ, వెబ్‌డెస్క్: సొంత ఇళ్లు లేని వారికి టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆదివారం పాయకరావుపేటలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారికి రెండు సెంట్ల స్థలం ఇస్తానని.. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. మరోవైపు వైసీపీ సర్కార్‌పై విమర్శలు కురిపించారు. సీఎం జగన్ దళిత ద్రోహి అని.. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాల్ని రద్దు చేశాడని ఆరోపించారు. ఎస్సీ డాక్టర్‌ను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో రాజ్యాంగం రచించారని.. కానీ ఏపీలో రాజ్యాంగం అమలు చేసే వ్యక్తి దుర్మార్గుడని పరోక్షంగా సీఎం జగన్‌ను విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యతను మేం తీసుకుంటామని స్పష్టం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాలనే మీదే టీడీపీ పుట్టిందని.. అంటరానితనాన్ని నిషేదించిందే టీడీపీ అని చెప్పారు. గతంలో పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీలకు న్యాయం చేశామని గుర్తు చేశారు. రాచరిక పాలన సాగిస్తోన్న వైసీపీని ఏపీ ప్రజలు భూస్థాపితం చేయాలని బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.