జనసేనతో కలిసే ఎన్నికలకు..ఏపీలో కుంభకోణాలపై కేంద్రం కన్ను: పురందేశ్వరి
జనసేన పార్టీతో బీజేపీ కలిసే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.
దిశ , డైనమిక్ బ్యూరో : జనసేన పార్టీతో బీజేపీ కలిసే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. జనసేన పార్టీతోనే కలిసే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం పర్యటించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం...కేసులు పెట్టి వేధించడం దారుణం అని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ కూడా లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో కుంభకోనాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పురందేశ్వరి వెల్లడించారు.
జనసేనతోనే మా పొత్తు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే వెళ్తాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే టీడీపీతో పొత్తు ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. వైసీపీ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు.