ప్రకాశం జిల్లాలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 3 పూరిగుడిసెలు
ప్రకాశంజిల్లా త్రిపురాంతక మండలంలో రేపల్లెగ్రామం ఎస్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
దిశ వెబ్ డెస్క్: ప్రకాశంజిల్లా లోని త్రిపురాంతక మండలంలో రేపల్లె గ్రామం లోని ఎస్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. రేపల్లె గ్రామం లోని ఎస్టీ కాలనీలో గురువమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. కాగా మహిళ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో మహిళ నివాసం ఉంటున్న గృహం పూరిగుడిసె కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో గురువమ్మ గుడిసె తో పాటు పక్కన ఉన్న మరో రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి.ఈ నేపథ్యంలో గుడిసెల పక్కనే ఉన్న గడ్డివాముకి కూడా పంటలు అంటుకొని అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.
దీన్ని గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ఎంతగా ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. దీంతో వారు ఫైర్ ఇంజన్ సిబ్బందిని ఆశ్రయించారు. స్థానికుల సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైనది పూరే గుడిసెలు కావడం.. దీనితో పాటు పక్కనే గడ్డివాము ఉండడంతో మంటలు అదుపు లోకి రావడం లేదు. కాగా ఈ ఘటనలో నష్టపోయిన బాధితులు పండగ పూట తాము నిరాశ్రయులం అయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనలో బాధితులు ఐదు లక్షల రూపాయల ఆస్తి నష్టానికి గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.