Field Assistant Posts:అమ్మకానికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు..!
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తల పగలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అనే పెద్దల మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందే. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అంగట్లో సరుకుగా మారిపోయాయి. పైగా ఈ పోస్టులను దక్కించుకోవడానికి ప్రత్యర్థులు పోటీ పడడం లేదు. సొంత పార్టీకి సంబంధించిన వారే పోటా పోటీగా కుస్తీ పడుతున్నారు. దీంతో ఈ పోస్టులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో తమ బలాబలాలను చాటుకునేందుకు పోటీ పడుతున్నారు.
దిశ,నందికొట్కూరు: కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరువు నేపథ్యం వల్ల ప్రతి సంవత్సరం లక్షలకు పైగా కూలీలు వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారని, వారికి స్థానికంగా 100 రోజుల పాటు గ్యారంటీగా ఉపాధి కల్పించేందుకు కోసం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ఉద్దేశం మంచిదే కానీ రాను రాను ఇందులో రాజకీయ ప్రమేయం అధికం కావడం తో పాటు పథకంలో ఉన్న లొసుగులను పసిగట్టి లక్షల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కొందరికి ఆదాయ వనరుగా మారిపోయింది. ఫలితంగా గ్రామాల్లో ఆధిపత్యం వర్గ పోరు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించి కొందరు కార్యకర్తలు, నాయకులకు ఉపాధి హామీ పథకాన్ని వరంగా మలుచుకుంటున్నారు.
ఇలా దోపిడీ జరుగుతుంది..
గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలంటే ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకము. వారిని ఏపీఓ ఎంపీడీవో ఇతర అధికారులు మానిటర్ చేస్తారు. ప్రతి గ్రామంలో 1000 నుంచి 5000 మంది దాకా ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు ఉంటాయి. ఇందులో కొందరు కూలీలు వివిధ ప్రాంతాలకు వెళ్లి పోయినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్ వారి దగ్గర జాబ్ కార్డులు తీసుకొని వివిధ మట్టి పనులు చేసినట్లు రికార్డులు తయారు చేసి డబ్బులు డ్రా చేస్తారు. ఇలా వంద రోజులు వివిధ ప్రాంతాల్లో మట్టి పనులు చేస్తారు. పనికి రాకపోయినా కూలీలకు ఎంతో కొంత డబ్బు ఇచ్చి మిగిలిన డబ్బును వారి నుంచి తీసుకొని ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ ఇలా కొందరితో లోపాయికారి ఒప్పందంతో డబ్బులు డ్రా చేయడం ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ. చిన్నపాటి గ్రామంలోనైనా సంవత్సరానికి 20 లక్షల నుంచి కోటి రూపాయల దాకా పనులు జరిగే పరిస్థితి ఉంటుంది అని ఆయా గ్రామాలకు సంబంధించిన నాయకులు చెబుతున్నారు. ఇందులో సగానికి సగం మిగులుబాటు ఉంటుంది. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు లక్షల రూపాయలు సంపాదించి సొంత భూములు, ఖరీదైన వాహనాలు, ఇతర ఆస్తులను కూడగట్టడం కళ్లారా చూసిన టిడిపి నేతలు ప్రస్తుతం ఆ పోస్టులను దక్కించుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే రెండు వర్గాలుగా విడిపోయి ఏపీఓ, ఎంపీడీఓ లపై ఒత్తిడి పెట్టినట్లు తెలుస్తోంది.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ రాబట్టుకోవడానికి రకరకాల మార్గాలను తమ బంధువుల ద్వారా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి సంబంధించిన నాయకులే ఆయా పోస్టులను పొందడానికి భారీగా పోటీపడి రేటు నిర్ణయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో 77 పంచాయతీ లు ఉన్నాయి. పంచాయతీ కి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పనిదినాలను సాకుగా పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల నుంచి తొలగించింది. కొందరు కోర్టులకు వెళ్లి మళ్లీ విధుల్లో చేరారు. కొన్ని పంచాయతీ లలో సీనియర్ మెటీలను తీసుకున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారి స్థానంలో తమ వారిని నియమించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం తో మళ్ళీ తెరపైకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ఒక మండల కేంద్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం లక్షల రూపాయల టార్గెట్ పెట్టారంటే ఈ పథకంలో ఏ మేరకు ఆదాయం వస్తుందో అర్థం అవుతుంది.ఈ విధమైన వ్యవహారం సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడిన కూటమి నేతలు ప్రస్తుతం సొంత పార్టీలో జరుగుతున్న ఈ విషయం పై కూటమి నేతలు స్పందించి అర్హత ఉండి, పారదర్శకంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు. అయితే పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వాలని అక్కడి నాయకులు విజ్ఞప్తి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి
నందికొట్కూరు నియోజకవర్గం ఆరు మండలాల్లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయాలని సీపీఐ జిల్లా నాయకులు యం. రమేష్ బాబు డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లోని వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేయాలని కోరారు.ప్రస్తుతం ఉన్న వారిని తొలగించకుండా కొనసాగించాలని సూచించారు.