‘పంట నష్టం సర్వేలో అవకతవకలు’.. న్యాయం చేయాలని రైతుల ధర్నా

పోలవరం మండలం లో ముంపుకు గురైన పంటల సర్వేలో మండల వ్యవసాయాధికారి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలువురు రైతులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

Update: 2024-09-20 13:33 GMT

దిశ, పోలవరం:పోలవరం మండలం లో ముంపుకు గురైన పంటల సర్వేలో మండల వ్యవసాయాధికారి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలువురు రైతులు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. పంట నష్టం అంచనాలు చేసే విషయంలో వ్యవసాయాధికారి కొంతమంది రైతులతో కమీషన్లు మాట్లాడుకుని ఎలాంటి పంట నష్టం జరగని , అసలు పంట వేయని రైతులను లబ్ధిదారుల జాబితాలో చేర్చి నిజమైన లబ్దిదారులకు అన్యాయం చేశారని రైతులు ఆరోపించారు. ఈ విషయమై వ్యవసాయ అధికారులను ప్రశ్నిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే చేశామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనాలు విషయంలో లబ్ధిదారుల పంటలు రీ సర్వే చేయాలని అర్హులైన రైతుల వంటలు కూడా పరిశీలించి లబ్ధిదారుల జాబితాలో చేర్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సర్వే విషయంలో అవకతవకలకు పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు మూడు సార్లు పంటలు నీట మునిగి నష్టపోయారని వాపోయారు. మళ్ళీ 15 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నాట్లు వేశామని లేతగా నాట్లు వేయడం వలన జనవరి నాటికి కోతకు వస్తుందని దిగుబడి కూడా తగ్గుతుందని రైతులకు న్యాయం చేయాలని కోరారు. తహశీల్దారు సాయి రాజు మాట్లాడుతూ పంట నష్టం రీ సర్వే వేరే బృందాలతో చేయించి రైతులకు న్యాయం చేస్తామని బాధ్యుల పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొణతాల ప్రసాద్, చెంచాని రత్న ప్రసాద్, ఉప సర్పంచ్ కోరశిక శ్రీనివాస్, రైతులు పసుపులేటి గుర్రాజు, పి బులి వెంకన్న, కరిబండి జగన్మోహన్ రావు.. మిరియాల అంజిబాబు, కరి బండి వెంకటేశ్వరరావు, కోడి పోసి బాబు, కరి బండి రామకృష్ణ పరుచూరి పోశీ తదితరులు పాల్గొన్నారు.


Similar News