రాయలసీమలో ఐప్యాక్ 'survey'.. నేతల్లో టెన్షన్

రాయలసీమ జిల్లాల్లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.

Update: 2022-12-13 02:19 GMT

దిశ, అనంతపురం : రాయలసీమ జిల్లాల్లో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ ప్యాక్) బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు, వారికి ప్రజల్లో ఉన్న ఇమేజ్, పార్టీ కార్యకర్తల్లో, నాయకులలో ఏ మేరకు అభిప్రాయాలున్నాయ్ అందులో పాజిటివ్, నెగిటివ్ ఎంత శాతం అన్నదానిపై ప్రాథమికంగా సర్వే చేసినట్లు సమాచారం. రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఐప్యాక్ బృందాలు చేస్తున్న సర్వేపై ఎమ్మెల్యేలకు గుబులు పట్టుకున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో, ప్రజల్లో వారి పని తీరుపట్ల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతృప్తి గా ఉన్నారా? లేదా? అన్న ప్రాథమిక విషయాలపైనే సర్వే చేసినట్లు సమాచారం.

వివిధ వర్గాలతో ఐప్యాక్ మీటింగ్‌లు..

రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించిన ఐ ప్యాక్ బృందాలు వివిధ వర్గాలతో సమావేశమైనట్లు సమాచారం. ఇందులో మహిళలు, యువత, వృద్ధులు, సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారులు ఇలా అన్ని వర్గాల వారిని కలిసిన ఐప్యాక్ బృందాలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పనితీరును గురించి తెలుసుకున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు ఆయన వద్దకు వెళ్తే ఏ విధంగా స్పందిస్తున్నారు? బాధితులు ఎవరైనా వెళ్తే ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు? స్థానికంగా ఉన్న ఆ సమస్యలను పట్టించుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారా? లేదా? గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీ ఇంటికి వచ్చారా లేదా ? ఆయన వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంది ? మీకు ఏమైనా సమస్యలుంటే ఆయన వద్ద ప్రస్తావించారా? ఒకవేళ ప్రస్తావించి ఉంటే ఆయన దానికి ఏ రకమైన సమాధానం చెప్పారు ? అనంతరం మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా? ఆఖరుగా స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై మీ అభిప్రాయం నిరభ్యంతరంగా చెప్పండని వారిని అడిగి మరీ వారి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం. ఇలా ఆయా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ ర్యాన్డంగా సర్వే చేసి ఆ నివేదికను ముఖ్యమంత్రికి అందజేసినట్లు తెలిసింది. దీంతోపాటు జిల్లాలో వైపీపీ పట్ల సానుభూతిగా ఉన్న మీడియా బృందాలతో సైతం వారు సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. వారి సమావేశాల్లో ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లావ్యాప్తంగా నెలకొని ఉన్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, లబ్ధిదారుల అభిప్రాయాలు, ప్రభుత్వ పాలన, స్థానిక ఎమ్మెల్యేల పాలన, పాత్రపై మీడియా బృందాల నుంచి సైతం సమాచారం సేకరించినట్లుగా తెలిసింది.

అధికార పార్టీ నాయకుల్లో మొదలైన గుబులు

ఆయా నియోజకవర్గాలలో ఐప్యాక్ బృందాలు సర్వే చేసుకుని వెళ్లి ఆ నివేదికను ముఖ్యమంత్రికి ఇచ్చినట్లు తెలిసింది. మరుక్షణం నుంచి ఎమ్మెల్యేలలో గుబులు మొదలైనట్లు సమాచారం. తమ నియోజకవర్గాలలో పనితీరుపై ఏ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందిందోనన్న ఆందోళనతో వారు ఉన్నట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో సైతం మరో నలుగురు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయి వ్యతిరేకతలో ఉన్నట్లుగా సమాచారం. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో సైతం ఒకటి, రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నట్టుగా తెలిసింది. దీంతో పాటు రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలలో పార్టీ కేడర్ పూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ఐప్యాక్ బృందం సర్వే నివేదికలు వెల్లడించినట్లు సమాచారం. తమ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు ఏ రకంగానూ లబ్ధి చేకూరలేదన్నది వారి వాదనగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు మాత్రం వారి స్థాయిలో ఆర్థికంగా బలోపేతం అయినట్లు ఉదాహరణలతో సహా ఐ ప్యాక్ బృంద సభ్యులకు వివరించినట్లుగా తెలిసింది. క్షేత్రస్థాయిలో ఇటు తెలుగుదేశం పార్టీతో ఎదురొడ్డి.. ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేకత ప్రబలకుండా కేడర్‌ను పటిష్టం చేసుకుంటూ వస్తున్నా.. తమ పట్ల పార్టీ అధిష్టానం చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించినట్లుగా సమాచారం. క్షేత్రస్థాయిలో తమ పరిస్థితి ఇలా ఉంటే ఎమ్మెల్యేలు మాత్రం వారి వారి స్థాయిల్లో అందివచ్చిన ప్రతి ఆర్థిక వనరునూ పూర్తిగా ఉపయోగించుకుని తమకు మొండి చేయి చూపినట్లుగా వివరించినట్లుగా తెలిసింది. ఇలా పార్టీ కేడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత ... ప్రజలలో నెలకొని ఉన్న అసంతృప్తుల నేపథ్యంలో ఎమ్మెల్యేలలో గుబులు మొదలైనట్లుగా తెలిసింది.

ఐ ప్యాక్ సలహాతోనే సమీక్షలు

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఆయా నియోజకవర్గాలలో ప్రజలు, పార్టీ కేడర్‌లో నెలకొని ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతను గుర్తించిన ఐప్యాక్ బృందం ఇచ్చిన నివేదికపై ఆధారపడి పార్టీ అధిష్టానం నియోజకవర్గ సమీక్షలకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరును మరింత మెరుగుపరిచేలా, చాలా వ్యతిరేకత ఉన్న వారు వారి పనితీరును మార్చుకునేలా చేయడానికి నియోజకవర్గ సమీక్షలను ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. ఇలా ఆయా నియోజకవర్గ సమీక్షలలో ఎమ్మెల్యే పనితీరు, పార్టీ కేడర్‌లో నెలకొని ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతలను గుర్తించి వారిని దారిలోకి తెచ్చేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలలో పార్టీ పట్ల వ్యతిరేకత ప్రబలకుండా పార్టీ కేడర్‌లో అసంతృప్తి, వ్యతిరేకత బయటకు పొక్కకుండా ఉండేలా చూసేందు కోసం పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐప్యాక్ బృందాలు సైతం ఆయా నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి వాటికి తగిన పరిష్కారాలు చూపేలా దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. వీలైతే మూడు నెలలకోసారి లేదంటే ప్రతినెలా సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ప్రజలలో విస్తృతంగా తిరిగి సమాచారం సేకరించడం చేయబోతునున్నట్లు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ రానున్న ఎన్నికలలో అధికార పార్టీ గెలుపు అంత సులభంగా లేదని ప్రాథమికంగా ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో స్పష్టం అయినట్లుగా సమాచారం. దీంతో అధిష్టానం క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం ఉన్న అన్ని అవకాశాలనూ ఉపయోగించుకోనున్నట్లు తెలిసింది. 

Also Read...

సంక్షేమాన్ని మింగేస్తున్న కేంద్రం.. అయినా సైలెంట్! 

Tags:    

Similar News