టాలీవుడ్‌ను ఏపీకి విస్తరించండి: సీఎం వైఎస్ జగన్

Update: 2022-02-10 13:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రంగం ఏపీకి రావాలని సీఎం జగన్ ఆహ్వానం పలికారు. టాలీవుడ్‌ను విశాఖకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ ఏపీకి విశాఖ షిఫ్ట్ అయ్యే వారికి, స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం స్థలాలు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో కూడా బంజారాహిల్స్ లాంటి ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని అందుకు సినీ పరిశ్రమ సహకరించాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖులతో భేటీ అనంతరం సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తో పోటీపడే సత్తా విశాఖపట్నంకు ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. చాలా సినిమాలు 20 శాతం ఏపీలోనే షూటింగ్ చేసుకుంటున్నాయని ఇలాంటి తరుణంలో విశాఖకు సినీ పరిశ్రమను విస్తరిస్తే మంచిదేకదా అని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.

ఏ సినిమాకైనా టికెట్ ధర ఒక్కటే..

ఏ సినిమా అయినా ఒకే టికెట్ ధర ఉండాలి అనేదే తమ అభిమతమని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బేధం లేకుండా అన్ని సినిమాలకు ఒకే రేటు ఉంటే మంచిదని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. నిర్మాతలకు నష్టం లేకుండా.. ప్రేక్షకుడికి భారం కాకుండా సినిమా టికెట్ ధరలు ఉంటాయని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అయితే భారీ సినిమాలకు టికెట్ ధరల విషయంలో మార్పులు ఇవ్వాలని యోచిస్తామని చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి లాంటి వారు భారీ బడ్జెట్‌తో నిర్మించే సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలు వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. వారం రోజుల పాటు ఆ సినిమాలకు వేరే ధరలు కేటాయించాలని నిర్ణయించినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవితో తాను మాట్లాడి కొన్ని ప్రతిపాదనలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రాంతం కంటే ఏపీ నుంచే అత్యధిక ఆదాయం వస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి 40 శాతం ఆదాయం వస్తుంటే ఏపీ నుంచి ఏకంగా 60 శాతం ఆదాయం వస్తుందని ఈ విషయాన్ని సినీ పరిశ్రమ గుర్తించాలని కోరారు. ఇక టికెట్ ధరల విషయంలో ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడుతుందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News