బీజేపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్తేల్చేశారు. టీడీపీ కూడా కలిసొస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీయే తరపున సీఎం అభ్యర్థి ఎవరనేది ఇప్పుడే తేలదని స్పష్టం చేశారు. ఎవరికెన్ని సీట్లు వస్తాయో దాన్నిబట్టి నిర్ణయం ఉంటుందన్నారు. తాను సీఎం కావాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరవుతూ పవన్చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలో పడేశాయి.
ఇప్పటిదాకా జనసేన, బీజేపీ తమతో కలిసొస్తాయన్న ఆశ ఉండేది. ఇప్పుడు సేనాని స్వరం మారింది. మా పొత్తులోకి టీడీపీ వస్తుందో రాదో తేల్చుకోవాలంటున్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు నష్టదాయకమని తమ్ముళ్లు వాపోతున్నారు. కాషాయ పార్టీ గేమ్‌తో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దిశ, ఏపీ బ్యూరో: ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించలేదు. బీజేపీ ఎత్తుగడ చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్రంలో కమలనాథులు బలపడాలంటే ప్రధానమైన రెండు ప్రాంతీయ పార్టీల్లో ఒకటి బలహీనం కావాలి. బలమైన వైసీపీని ఏం చేయలేదు. కొంత బలహీనంగా ఉన్న టీడీపీని దెబ్బ కొట్టి ప్రతిపక్ష స్థానాన్ని కైవసం చేసుకోవాలనేది కాషాయ పార్టీ ఎత్తుగడ. అందులో భాగంగానే ఎన్టీఆర్ తనయ పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. వైసీపీని మళ్లీ గద్దెనెక్కించాలన్నదే బీజేపీ వ్యూహమని స్పష్టమవుతోంది. ఈపాటికే జనసేనాని చేసిన రచ్చతో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచారు.
ఒకవేళ కలిసినా కష్టమే..
ఒకవేళ బీజేపీలో చేరిన టీడీపీ నేతలు, పవన్ రాయబారాలు ఫలించి టీడీపీ ఎన్డీయేలో చేరినా.. బీజేపీ మీద ప్రజల్లో వ్యతిరేకత టీడీపీ విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. అసలే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ధరలు పెంచిందని ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. నిత్యావసరాలపై జీఎస్టీ పన్నులు బాదేస్తున్నదని మండి పడుతున్నారు.
అది దగాకోరు పార్టీ..
కరెంటు చార్జీలు పెరగడానికి పరోక్షంగా బీజేపీ కారణమని జనానికి తెలిసి పోయింది. ఒకవేళ బీజేపీతో చేయికలిపితే విశాఖ స్టీల్ ప్లాంటు అమ్మకం, పూర్తి కాని పోలవరంపై ప్రజలకు సమాధానం చెప్పలేని దుస్థితి టీడీపీకి ఎదురవుతుంది. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని బీజేపీని దగాకోరు పార్టీగా ప్రజలు అభివర్ణిస్తున్నారు. విభజన హామీలు నెరవేర్చలేదన్న అక్కసు ప్రజల్లో నెలకొంది. ఇవన్నీ టీడీపీని దెబ్బతీస్తాయని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.
బీజేపీ వ్యూహంలో సమిధ కానున్న టీడీపీ..
ఇప్పటికీ ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్‌కు ఉన్న తెరచాటు బంధంలో ఎలాంటి తేడాల్లేవు. బీజేపీ గేమ్‌ప్లాన్‌లో టీడీపీ పావుగా మారి అధికారానికి దూరమవుతుందని పార్టీలో ఓ సెక్షన్మథనపడుతోంది. నిజంగా బీజేపీ వైసీపీని ఓడించాలనుకుంటే ఈపాటికే జగన్‌తో నెరుపుతున్న సంబంధాల్లో మార్పు కనిపించేదని అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకొస్తున్నారు.
దీంతో చంద్రబాబు బీజేపీతో కలిసి వెళ్లాలా లేదా అనే మీమాంసలో పడినట్లు తెలుస్తోంది. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో ఏమేరకు చీలిక వస్తుందనేది అంచనా వేస్తున్నట్లు సమాచారం. దీంతో బాబు ఇప్పటికిప్పుడు తొందరపడి ఓ నిర్ణయానికి రాకపోవచ్చని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.