AP:సీఎం చంద్రబాబు పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-24 08:40 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని తెలిపారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద ఘన స్వాగతం తెలిపారు. మాజీ మంత్రులు జైలు నుంచి విడుదలైన పిన్నెల్లిని పరామర్శించారు. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనిషి పిన్నెల్లిని అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని అన్నారు. ప్రజలకు సంబంధించిన వ్యక్తి పై వివిధ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. వరుసగా నాలుగు సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారని చెప్పారు.

చంద్రబాబు ఇలానే ప్రవర్తిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని దేవున్ని కోరుకుంటున్నామని అన్నారు. పిన్నెల్లి పై మరిన్ని కేసులు నమోదు చేసి మళ్లీ జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరికీ అధికారం శాశ్వతం కాదని చెప్పారు. అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోతే హైదరాబాద్‌కు వెళ్లిపోతారని ఆరోపించారు. కానీ అధికారులు ఇక్కడే ఉండాల్సి ఉంటుందన్నారు. 100 రోజుల్లో మంచి పాలన అందిస్తామన్న చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులకు భయపడమని..దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఈ క్రమంలో ఏపీలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని మాజీ మంత్రి కాకాణి వెల్లడించారు.


Similar News