రామోజీ రావును దెబ్బతీసేందుకు కొన్ని ప్రభుత్వాలు కుట్ర.. మాజీ జర్నలిస్ట్ రామ్ సంచలన వ్యాఖ్యలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావుపై ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్.రామ్ ప్రశంసల వర్షం కురిపించారు.

Update: 2024-06-27 14:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావుపై ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్.రామ్ ప్రశంసల వర్షం కురిపించారు. విజయవాడలో గురువారం రామోజీ రావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్.రామ్ మాట్లాడుతూ.. రామోజీ రావు లాంటి జర్నలిస్టులు చాలా చాలా అరుదు అని అన్నారు. ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రామోజీ రావు తనకు పరిచయమని, ఆయన నమ్మిన విలువల కోసం కట్టుబడే ఉండే వ్యక్తి అని కొనియాడారు. జర్నలిస్టులే లక్ష్యంగా అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం పరువు నష్టం బిల్లు తెచ్చిందని, ఆ బిల్లుపై ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా రామోజీ రావు వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు.

రామోజీ రావు పోరాట ఫలితంగా ఆ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. ఈనాడు ప్రస్థానంపై ఆస్ట్రేలియన్ రాజకీయవేత్త రాబిన్ జెఫ్రీ ఏకంగా పుస్తకమే రాశారని, జిల్లా టాబ్లాయిడ్‌ల గొప్పదనం గురించి జెఫ్రీ ఆ పుస్తకంలో ప్రత్యేకంగా వివరించారని చెప్పారు. పత్రికలు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలని రామోజీ రావు భావించేవారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని ఆయన అనేవారని రామ్ గుర్తు చేసుకున్నారు. రామోజీ రావును దెబ్బతీసేందుకు కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నించాయని, అయినప్పటికీ ఎంతో నిబ్బరంతో ఉండి ప్రభుత్వాల దాడిని ఆయన ఎదుర్కొన్నారని ప్రశంసించారు. పాత్రికేయ, వినోద రంగాల్లో రామోజీ రావు విశిష్ట వ్యక్తిగా నిలుస్తారని కొనియాడారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తిగా రామోజీ రావు చరిత్రలో నిలుస్తారని వ్యాఖ్యానించారు.   

Tags:    

Similar News