హోంమంత్రి వచ్చినా.. మెడలో టీడీపీ కండువా తీయని వృద్ధుడు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ చేయాల్సిందే. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికీ మినహాయింపు లేదు. వైఎస్ జగన్ మినహా ప్రతీ ఒక్కరూ ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సిందే. అయితే ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులకు కొన్ని షాక్‌లు తగులుతున్నాయి. మరికొన్ని చోట్ల పరాభవం ఎదురవుతుంది. అయినప్పటికీ వైసీపీ ప్రజాప్రతినిధులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మార్కులు పెంచుకోవడమే కాదు అధినేత వద్ద తమ గ్రాఫ్ పెంచుకునేందుకు పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు ఆసక్తికర సంఘటన ఎదురైంది. తానేటి వనిత తన సొంత నియోజకవర్గంలో తాళ్లపూడి మండలం బల్లిపాడులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కు చెందిన 80 ఏళ్ల వల్లభని సోమరాజు మొదటి నుంచి టీడీపీ అంటే అభిమానం. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి తానేటి వనిత వల్లభని సోమరాజు ఇంటికి వెళ్లారు. హోంమంత్రి తన ఇంటికి వచ్చారని తెలుసుకున్న సోమరాజు మెడలో టీడీపీ కండువా వేసుకుని బయటికి వచ్చారు. పోలీసులు, వైసీపీ నేతలు మెడలో టీడీపీ కండువా తీసేయాలని సూచించారు. అయినప్పటికీ సోమరాజు మెడలో నుంచి కండువాను మాత్రం తియ్యలేదు.
వైరల్ అవుతున్న ఫోటో
అనంతరం హోంశాఖ మంత్రి తానేటి వనిత ప్రభుత్వ పథకాలను సోమరాజుకు వివరించారు. పింఛన్, రైతు భరోసా వస్తుందా అని అడిగారు. వస్తున్నాయని సోమరాజు సమాధానమిచ్చారు. అర్హత కలిగిన ప్రతీ పథకం అందుతుందా అని అడిగారు. అందుతున్నాయని సోమరాజు తెలిపారు. అనంతరం మంత్రి తానేటి వనితతో వ్యక్తిగతంగా ముచ్చటించారు. ‘మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. టీడీపీలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి’ అని సోమరాజు గుర్తు చేశారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని తానేటి వనిత ప్రశ్నించారు. బాగానే ఉన్నానని సోమరాజు సమాధానం ఇచ్చారు. హోమంత్రి పథకాలు వివరిస్తుండగా టీడీపీ కండువా మెడలో వేసుకుని సమాధానం చెప్పిన సదరు వృద్ధుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వృద్ధుడికి టీడీపీపై ఉన్న అభిమానాన్ని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రసంసిస్తుంటే ఇతర పార్టీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. మరికొందరు అయితే ఆయనను సాహస వీరుడిగా అభివర్ణిస్తున్నారు.