కులం, ప్రాంతీయ సెంటిమెంట్లు ఫలిస్తాయా..!

ఏ నోట విన్నా ఒక్కటే మాట. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయ్? ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారు? సమస్యలు ప్రధాన అజెండా అవుతాయా

Update: 2023-03-06 03:11 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏ నోట విన్నా ఒక్కటే మాట. ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయ్? ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తారు? సమస్యలు  ప్రధాన అజెండా అవుతాయా లేక పోల్​మేనేజ్‌మెంటు ఎత్తుగడలకు ఫిదా అయిపోతారా? కొత్త హామీలకు జై కొడతారా.. కులం, ప్రాంతీయ సెంటిమెంట్లకు ప్రాధాన్యమిస్తారా అంటూ టీ కొట్ల దగ్గర జనంలో ఎడతెగని చర్చలు. ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉంది. అయినా ప్రధాన పార్టీలు దూకుడు పెంచి ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి దారి మళ్లించడానికి అధికార వైసీపీ ప్రయత్నిస్తుంటే.. అంతకన్నా ఎక్కువగా టీడీపీ, జనసేన ఎదురు దాడి చేస్తూ క్యాడర్‌లో జోష్​ నింపుతున్నాయి.

ఇంతవరకు విపక్షాలు మేనిఫెస్టో విడుదల చేయలేదు. వైసీపీ కొత్త హామీలు ఇవ్వలేదు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అర్థంగాకనే ఈ తిప్పలని తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులకు సైతం అంచనాలు అందక రకరకాల ఫీట్లు కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ప్రజలు నిరంతరం పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్ల క్రితం నాటి ధరలతో పోల్చుకొని గుండెలు బాదుకుంటున్నారు. పెట్రోలు, డీజిల్​ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు రెండింతలయ్యాయని పప్పు, ఉప్పు ధరలు పెంచేశారు. కరెంటు చార్జీలు పెరిగినప్పుడు మరోసారి పెంచారు. తర్వాత జీఎస్టీ పన్నులు వేయడంతో ధరలు పెరిగాయి. ఇక అక్కడ పంట దిగుబడి తగ్గింది. ఇక్కడ దిగుమతి చేసుకోవాల్సి వచ్చినందున ధరలు పెరిగాయంటూ వ్యాపారుల దందాకు తిరుగు లేదు.

ఏతావాతా సామాన్యుడు ధరాఘాతంతో విలవిల్లాడుతున్నాడు. గత ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటికి 40 నుంచి 50 శాతం తిండి ఖర్చులు పెరిగాయని లబోదిబోమంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరెన్ని తాయిలాలు ఇచ్చి మెప్పించాలనుకున్నా వీటి నుంచి దృష్టి మళ్లించడం అంత తేలిక కాదని విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు. గ్లోబల్ ​ఇన్వెస్టర్స్​ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకున్నామని ప్రభుత్వం గొప్పలకు పోతోంది. అందులో రూ.8.5 లక్షల కోట్లకు పైగా చేసుకున్న ఒప్పందాలన్నీ పవర్ ​ప్రాజెక్టులకు సంబంధించేనని తెలుస్తోంది. జెన్‌కోలను పక్కన పెట్టి ఇలా విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు అవకాశమివ్వడమంటే మరింతగా ప్రజల రక్తాన్ని పీల్చడమే అవుతుంది. విద్యుత్ ​తయారీ, పంపిణీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే ఎలాంటి దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఢిల్లీతో సహా అనేక రాష్ట్రాల అనుభవాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి.

గత ప్రభుత్వం ఇలాగే పవర్ ​పర్చేజ్​అగ్రిమెంట్లను కుదుర్చుకుంటే వాటిని మార్చడం వైసీపీ ప్రభుత్వ తరం కాలేదు. మళ్లీ అదే తప్పును వైసీపీ సర్కారు చేస్తోంది. త్వరలో ప్రీపెయిడ్ ​మీటర్లను ప్రజల నెత్తికి ఎత్తనున్నారు. దీంతో నిరంతరం పెరిగే కరెంటు చార్జీలు రానున్న ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెడతాయని పరిశీలకులు అంటున్నారు. ఇక ప్రాంతాల వారీ ప్రత్యేక సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ఎప్పటికీ పూర్తవుతుందో తెలీదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు అంచనాలను కేంద్రం ఆమోదించడం లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణమే ప్రశ్నార్థకమైంది. నిర్వాసితుల పునరావాసం, పరిహారం 20% కూడా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పినా గోదావరి పరివాహక ప్రజలు వినే ఓపిక నశించింది. విశాఖ ఉక్కును కేంద్రం తాబేదారులకు తెగనమ్మేందుకు ఉవ్విళ్లూరుతుంది. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై ప్రధాన మూడు పార్టీలు నాటకాలాడుతున్నాయి.

మరోవైపు అమరావతి రాజధానిపై ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తోంది. మూడు రాజధానుల సెంటిమెంట్ పండలేదు. అయినా విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని అధికార పార్టీ భీష్మించింది. అక్కడ సానుకూలత రాకపోగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇక రాయలసీమలోని పెండింగ్​ ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి చేయలేకపోయారు. ఆ అసంతృప్తులు తీవ్ర స్థాయికి చేరాయి. రానున్న ఎన్నికల్లో ప్రత్యేకంగా ఇవి ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీలు కులం కార్డుల ఆధారంగా లెక్కలేసుకుంటున్నాయి. ఓ కుటుంబంలోని సభ్యులే భిన్న రాజకీయ ఆలోచనలు కలిగి ఉన్నారు. విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది ఏకంగా జనాన్ని కులం గాటన కట్టేసి గంపగుత్తగా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. పార్టీలు ఎంతగా కులతత్వాన్ని పెంచినా అర్బన్ ఓటర్లలో ప్రభుత్వ తీరుతెన్నులపై తమ అభిప్రాయాలకే ప్రాధాన్యమివ్వనున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మారుమూల గ్రామీణ ఓటర్లలో మాత్రమే కులం, గ్రూపుల ప్రభావం కొంతమేర ఉంటుంది. అధికారం కోసం పోటీపడే అన్ని పార్టీలు తాయిలాలు పంచడం షరా మామూలే. ఈ దఫా ఎన్నికల్లో కులం, తాయిలాలు, ప్రాంతీయ తత్వాన్ని మెజార్టీ ఓటర్ల చైతన్యం అధిగమిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

నెల్లూరులో కాకరేపుతున్న కోటంరెడ్డి టీడీపీ ఎంట్రీ  


Similar News