అధికారంలోకి రాగానే కొత్త చట్టం తెస్తాం: నారా లోకేష్
బీసీలకు పుట్టినిళ్లు టీడీపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు..
దిశ, ఏపీ బ్యూరో: బీసీలకు పుట్టినిళ్లు టీడీపీ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పాయకరావుపేట నియోజక వర్గంలో బీసీ ప్రజా ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. బీసీల వెన్నెముకను జగన్ అధికారంలోకొచ్చిన తర్వాత విరగొట్టారన్నారు. గొర్రెల కొనుగోలు కోసం జగన్ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదన్నారు. చంద్రన్న బీమాను జగన్ ప్రభుత్వం ఎత్తేసిందన్నారు. జగన్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. చెట్లపై నుంచి పడిపోయి ఎవరైనా చనిపోతే కుటుంబానికి ఎటువంటి సాయం అందించడం లేదన్నారు. మత్స్యకారులకు జగన్ చాలా హామీలు ఇచ్చి మోసం చేశాడని, బంగారమ్మపాలెంలో నేవీ భూముల సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి మోసం చేశాడని దుయ్యబట్టారు. సగర కులస్తులకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. బీసీ కమ్యూనిటీ హాళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదన్నారు.
అయితే జగన్ ప్రభుత్వంలో బీసీలపై పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తేయాలని నారా లోకేష్‌ను పలువురు కోరారు. అందుకు స్పందించిన లోకేష్ పాయకరావుపేట పౌరుషాలపేట అని, ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పుడూ మర్చిపోలేనన్నారు. బీసీలకి రాజకీయ, ఆర్థిక స్వాతంత్యం ఇచ్చింది అన్న ఎన్టీఆర్ అన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ అని గుర్తు చేశారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్‌ను వైసీపీ నాయకులు దారుణంగా చంపేశారని చెప్పారు. అమర్నాథ్ గౌడ్ అక్కను తప అమ్మ చదివిస్తుందని గుర్తు చేశారు. 64 మంది బీసీలను వైసీపీ నాయకులు చంపేశారని, 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వమని మండిపడ్డారు. తమ ప్రభుత్వం రాగానే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా కల్పించారు. గొర్రెల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు అందిస్తామని, మేత, మందులు కూడా సబ్సిడీలో అందించనున్నట్లు చెప్పారు. చంద్రన్న బీమా రూ.5 లక్షలతో ప్రారంభించి రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. మత్స్యకారుల చేతిలో ఉన్న చెరువులు జీఓ 217 తీసుకొచ్చి వైసీపీ నేతలు కొట్టేశారన్నారు. మత్స్యకారులను రోడ్డుపైకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే జీఓ 217 రద్దు చేసి చెరువులు మత్స్యకారులకు అందిస్తామని లోకేష్ హామిచ్చారు.