చంద్రబాబును నమ్మొద్దు.. తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచాడు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ఆ పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-04-28 09:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలను ఆ పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిపాటు ఈ వేడుకలను కన్నులపండువగా నిర్వహిస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఈ వేడుకలకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. శతజయంతి ఉత్సవాలు నిర్వహించే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు.

సత్తెనపల్లిలో శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు ఆయన శత జయంతి వేడుకలను నిర్వహించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మంత్రి అంబటి రాంబాబు మీడియాకు విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబాబును ఎన్టీఆర్ ఔరంగజేబుతో పోల్చిన విషయాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. చంద్రబాబు సీఎం పదవిపై వ్యామోహంతో చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ను మానసిక హింసకు గురి చేశారని అంబటి ఆరోపించారు.చంద్రబాబు కారణంగానే ఎన్టీఆర్ మనోవేదనకు గురై మృతి చెందారని ఈ విషయం అందరికీ తెలుసునన్నారు. తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును నమ్మొద్దని రాష్ట్ర ప్రజలకు మంత్రి అంబటి రాంబాబు సూచించారు.

రెండున్నర లక్షల కోసం కక్కుర్తి పడను

రూ.5 లక్షల పరిహారంలో సగం కమిషన్ గా ఇవ్వలేదని తొక్కిపట్టిన చెక్కును బాధిత కుటుంబానికి ఎప్పుడిస్తారు మంత్రి అంబటి ? ఆ చెక్ ఇప్పుడు ఎక్కడ ఉంది? నిన్న నా సభకు రాకుండా బాధితులు తురక గంగమ్మ, పర్లయ్య కుటుంబాన్ని పోలీసులతో ఎందుకు నిర్బంధించారు? అని చంద్రబాబు నాయుడు విసిరిన సెల్ఫీ చాలెంజ్‌కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.గంగమ్మ అనే మహిళ వద్ద రెండు లక్షలు లంచం అడిగినట్టుగా చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండించారు.

గంగమ్మ తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఆమెకు రూ. 4 లక్షలు పవన్ కళ్యాణ్, రూ. 2 లక్షలు చంద్రబాబు ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. తాను లంచం తీసుకొనేవాడినో ,కాదో సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు. పట్టణంలో కందికొట్ల కొండ కు చెందిన హోటల్ లో మురుగు శుభ్రం చేయడానికి వచ్చిన తురక అనిల్‌‌తో పాటు మరో యువకుడు ఊపిరి అందులో పడిపోయారని, ఆ సమయంలో వారిని కాపడటానికి డ్రైన్‌లో దిగిన హోటల్ ‍యజమాని కొండలు కూడా ప్రాణాలు కోల్పోయాడని మంత్రి అంబటి గుర్తు చేశారు.

బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చామని చెప్పుకొచ్చారు. గంగమ్మతో పాటు ఆమె సోదరుడు రోశయ్య కుటుంబానికి చెరో రెండున్నర లక్షలు ఇప్పించామని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ నిధులు వచ్చిన తర్వాత వాటిని హోటల్ యజమాని కుటుంబానికి తిరిగి చెల్లించాలని ముందే స్పష్టంగా చెప్పామని..ఈ ఘటనలో హోటల్ యజమాని కుటుంబం కూడా నష్ట పోయినందున ముఖ్యమంత్రి సహాయ నిధిలో సగం వారికి చెల్లించాలని సూచించినట్లు గుర్తు చేశారు. అంతేతప్ప రెండున్నర లక్షల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం తనకు లేదని రాజకీయ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ డ్రామా ఆడారని ఆరోపించారు. తన మీద నిందలు వేస్తే జనసేన పార్టీ నాలుగు లక్షలు సాయం చేసిందని, తాజాగా చంద్రబాబు అదే నిందలు వేశారని మండిపడ్డారు. ఈ నాయకులంతా తురక అనిల్ చనిపోయిన రోజు ఏమయ్యారని ప్రశ్నించారు. తన మీద ఆరోపణలు చేయడానికి మాత్రం వచ్చారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

Tags:    

Similar News