శునకానందం పొందొద్దు..నేను పోటీ చేసి తీరుతా: మంత్రి ఆర్‌కే రోజా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ వేరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్‌కే రోజా స్పందించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ వేరొకరికి కేటాయిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆర్‌కే రోజా స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. నేను పోటీ చేస్తానో.. చేయనో అనేది తమ పార్టీ అధిష్టానానికి తెలుసునని అన్నారు. తనకు టికెట్ రాదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆర్‌కే రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు టికెట్ రాదని శునకానందం పొందేవారి ఆశలు ఫలించవని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అని చెప్పుకొచ్చారు. మరోవైపు తనకు టికెట్ ఇవ్వకపోయినా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకోసం కృషి చేస్తానని మంత్రి ఆర్‌కే రోజా హామీ ఇచ్చారు.
రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పోటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అప్పగించిన ప్రతీ పనిని పూర్తి చేస్తున్నట్లు మంత్రి ఆర్‌కే రోజా వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలలో సైతం నిత్యం పాల్గొంటున్నట్లు తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు వరుసలో తానే ఉన్నట్లు రోజా చెప్పుకొచ్చారు. టికెట్ విషయం అటు ఉంచితే తాను జగనన్న సైనికురాలిని అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయకముందు నుంచి తాను జగన్ వెంట నడుస్తున్నట్లు గర్తు చేశారు. టికెట్ విషయంలో జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని మంత్రి ఆర్‌కే రోజా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని అందువల్లే రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు పోటీ చేస్తారని అన్నారు. ఒక్కచోట పోటీ చేస్తే గెలుస్తామో? లేదో అనే భయంతో రెండేసి నియోజకవర్గాలలో అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడులు సర్వేలు చేయించుకున్నారని మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు.