హోం మంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేలకైనా తెలుసా..?
విశాఖలోని కేజీహెచ్ వద్ద తహసీల్దార్ రమణయ్య మృతదేహానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు
దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖలోని కేజీహెచ్ వద్ద తహసీల్దార్ రమణయ్య మృతదేహానికి టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకే రక్షణ లేకుండా పోయిందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖను క్రైమ్ క్యాపిటల్ గా మార్చారని మండిపడ్డారు.
అలాగే తహసీల్దార్ రమణయ్య హత్య దుర్మార్గం అని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి భద్రతల నిర్లక్ష్యానికి అద్దం పడుతొందని, ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజల ఆస్తులకే కాదు, ప్రాణాలకు కూడా రక్షణ లేదని అన్న అచ్చెన్నాయుడు, అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఎవరో వైసీపీ ఎమ్మెల్యేల్లోనే సగం మందికి తెలియదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇన్ని నేరాలు జరుగుతుంటే.. హోం మంత్రి, పోలీసులు ఎక్కడా అని ప్రశ్నించారు. తహసీల్దార్ హత్యపై వెంటనే విచారణ జరిపించి దోషులను శిక్షించాలని అచ్చెన్నాయుడు అన్నారు.