ఇంద్రకీలాద్రిపై పోలీసులు చేయి చేసుకున్నారంటూ భక్తుల ఆందోళన

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఏడో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి.

Update: 2024-10-09 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు ఏడో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు (బుధవారం) మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో భారీగా రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఓ భక్తురాలితో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఓ భక్తురాలిపై పోలీసులు చేయిచేసుకున్నారంటూ కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై ఉన్నతాధికారులకు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తమను పోలీసులు కనీసం సరిగా దర్శనం కూడా చేసుకోనివ్వడం లేదని ఆరోపించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే దేవీ శరన్నవరాత్రులు కావడం, అందులోనూ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం కావడంతో నేడు అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి నుంచే వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. దీంతో రద్దీని అరికట్టేందుకు హోల్డింగ్ ఏరియాలలో భక్తులను ఉంచి.. విడతల వారీగా క్యూలైన్లలో దర్శనానికి పంపిస్తున్నారు పోలీసులు. దర్శనాలు రాత్రి 11 గంటల‌ వరకూ కొనసాగుతాయని, భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరం అయితే మరో అరగంట దర్శన సమయం పెంచే అవకాశం కూడా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. 

Read More : దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం


Similar News