ఏలేరు వరద ముంపుపై.. అధికారులతో డిప్యూటీ సీఎం వీడియోకాన్ఫరెన్స్!

ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2024-09-10 11:39 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలపై అధికారులతో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ముంపుకు గురైన ఏలేరు ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను వేగవంతం చేయాలని, రైతులకు భరోసాను కల్పించాలని అధికారులను ఆదేశించారు పవన్. ఏలేరు వరద ముంపుకు ప్రభావితమైన 21 మండలాల్లో ఉన్నటువంటి 152 గ్రామాలలో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు వారికి అవసరమైన వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహాదారులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు.దీంతో పాటు వరదల వల్ల ఎవరికీ ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలను చేపట్టాలని, అలాగే ప్రాణ నష్ట నివారణ చర్యలను చేపట్టాలని అధికారులకు పవన్ సూచించారు.

కాగా.. నిన్న కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ముఖ్యంగా ఏలేరు దిగువన గల సుద్దగడ్డ వాగుకు వరద పెరగడం వలన స్థానికంగా ఉన్న కాలనీలు వరద నీటిలో మునిగిపోగా.. ఈ ప్రాంతాలను పవన్ స్వయంగా పడవలో వెళ్లి పరిశీలించారు. ఇక్కడి ఎమ్మెల్యేగా సుద్దగడ్డ వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని స్థానికులకు పవన్ హామీ ఇచ్చారు.ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, తగిన సూచనలు ఇస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.


Similar News