పిఠాపురానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

Update: 2024-06-19 02:43 GMT

దిశ, కాకినాడ జిల్లా ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో పిఠాపురంలో టీడీపీ, జనసేనల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకున్న పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ వర్మపై వన్నెపూడిలో జనసేన కార్యకర్తల దాడి కూటమి నేతలను ఆందోళనకు గురి చేసింది. ఆ మరుసటి రోజే తాటిపర్తిలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే స్వయాన వర్మ స్పందిస్తూ అసలైన జనసైనికులు, టీడీపీ శ్రేణుల మధ్య ఎటువంటి వివాదం లేదని, టీడీపీ నుంచి బహిష్కరించిన కొంత మంది జనసేనలో చేరి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వీరికి కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అండదండలున్నాయని వర్మ ఆరోపించారు. దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందిస్తూ ఈనెల 20న పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తున్నారని తెలిపారు.

ఇక్కడి నుంచే కార్యాచరణ ప్రణాళిక..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు. పిఠాపురం నుంచి పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మంత్రి వర్గ కూర్పులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యేక గౌరవం దక్కింది. ఉప ముఖ్యమంత్రి పదవి తో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు కేటాయించారు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఈ నెల 20న పిఠాపురంలో పర్యటించనున్నారు. తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుసుకొని నియోజక వర్గంలో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలు, స్థానిక కార్యకర్తలను తనే స్వయంగా వచ్చి కలుస్తానని, ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటించే కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

Also Read: కాసేపట్లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కల్యాణ్..

Tags:    

Similar News