ఏపీ అతలాకుతలం.. పవన్ కీలక సందేశం
ఏపీలో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడంతో జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సందేశం ఇచ్చారు...
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలు జలమయమయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో వేల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. అయితే వాగులు, వంకలు ఒక్కసారిగా పొంగడంతో వరద నీరు ఇళ్లు, రోడ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో చేరింది. దీంతో జనజీవనం అస్తవ్యవస్థమైంది. అప్రమత్తమైన ప్రభుత్వ యంతాంగ్రం వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టారు.
ఇక రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిని అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ కీలక సందేశం ఇచ్చారు. అధికార యంత్రాంగంతో పాటు జనసేన నేతలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఉత్తరాంధ్ర, కోస్తాపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉందని, విజయవాడ, గుంటూరులో 10 మంది మృతి చెందడం బాధాకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.