జాబ్ కార్డుల్లో అవకతవకలు.. ఉపాధి పథకం నిధుల మళ్లింపుపై లోతు విచారణ : డిప్యూటీ సీఎం
వ్యవసాయ అనుబంధ పనులకు నరేగాను అనుసంధానిస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆఖరిరోజున ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు.
దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయ అనుబంధ పనులకు నరేగాను అనుసంధానిస్తామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆఖరిరోజున ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. ఉపాధి పథకం నిధుల మళ్లింపుపై విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా చేస్తున్నామని, రూ.4500 కోట్లతో గ్రామసభలు నిర్వహించి.. 30 వేల పనులకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సంక్రాంతిలోగా ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు.
అలాగే.. జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరుగుతోందని, సాగు పనులను ఉపాధి హామీకి అనుసంధానంపై పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయవచ్చని, శ్మశానవాటికల ప్రహరీ గోడల నిర్మాణ పనులు కూడా చేయవచ్చని తెలిపారు.
తీర ప్రాంత కోతలపై కచ్చితంగా దృష్టి పెడతామన్నారు పవన్ కల్యాణ్. మత్స్యకార గ్రామాల్లో ప్రజా ప్రతినిధులను కూడా గుర్తించాలని NCCR దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. తానే స్వయంగా ప్రత్యక్ష భాగస్వామ్యం తీసుకుని పరిష్కరిస్తానని చెప్పారు.