వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

Update: 2023-01-31 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ విచారణను తెలంగాణ సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో విచారణ స్పీడందుకుంది. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారించిన సీబీఐ తాజాగా కీలక ఆధారాలను సేకరించే పనిలో పడింది. వైఎస్ అవినాశ్ రెడ్డి కాల్ డేటాను సీబీఐ సేకరించినట్లు వార్తలు వెలువడుతున్న తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంపై సీబీఐ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా క్యాంపు కార్యాలయంలోని ఓ పవర్ సెంటర్ వ్యక్తి పీఏకి భారీగా ఫోన్ కాల్స్ చేరినట్లు సీబీఐ గుర్తించింది.

ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి క్యాంపు కార్యాలయంలో పనిచేసే నవీన్‌కు కాల్స్ వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో నవీన్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. నవీన్‍తో పాటు మరో ముఖ్య నేత సన్నిహితుడికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐ నవీన్‌కు నోటీసులు జారీ చేయడంపై వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి స్పందించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నివాసంలో నవీన్ 15ఏళ్లుగా పనిచేస్తు్న్నాడని తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్ భారతితో మాట్లాడాలంటే తాను కూడా నవీన్ నంబర్‌కే ఫోన్ చేస్తానని వైవీ సుబ్బారెడ్డి అన్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి.

Tags:    

Similar News