నాలుగు మండలాల్లో పంట నష్టం..చెరువులను తలపిస్తున్న పంట పొలాలు

నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నందికొట్కూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 3813 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

Update: 2024-09-03 13:36 GMT

దిశ,నందికొట్కూరు:నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నందికొట్కూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 3813 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మండల వ్యవసాయ అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. పలు గ్రామాల్లో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు సతీష్ బాబు, వెంకటరమణ, శివరామకృష్ణ, అశోక్ కుమార్‌లు నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మిడుతూరు, జూపాడుబంగ్లా, మండలాలలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా, పగిడ్యాల, నందికొట్కూరు, మిడుతూరు మండలాల్లో పత్తి 97 హెక్టార్లలో, కంది 389 హెక్టార్లలో, మొక్కజొన్న 2736 హెక్టార్లలో, మినుము 264 హెక్టార్లలో, కొర్ర 99, సోయాబీన్ 124 హెక్టార్లలో, వరి 26, మిరప 10, ఉల్లి 8, పొగాకు 64 హెక్టార్లలో, తదితర పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.

పంట నష్టాన్ని అంచనా వేసి జాబితాను సిద్ధం చేసినట్లు తెలిపారు. పగిడ్యాల మండలం లో 1130 హెక్టార్లు, జూపాడుబంగ్లా మండలంలో 673.8 హెక్టార్లు, మిడుతూరు మండలంలో 651 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. నాలుగు మండలాల్లో 3813 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని 3430 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. నివేదికలను జిల్లా ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని తెలిపారు. వీరి వెంట నందికొట్కూరు ఏడీఏ విజయ శేఖర్, నందికొట్కూరు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి , మిడుతూరు ఏఓ ఫిర్ నాయక్, రైతు సేవా కేంద్రం సిబ్బంది శాంతి రాజు, రైతులు ఉన్నారు.


Similar News