ఎన్టీఆర్ కెనాల్‌లో మొసలి సంచారం కలకలం..
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు, ఎన్టీఆర్ లెఫ్ట్ కెనాల్‌లో మొసలి సంచారం కలకలం రేపింది.
దిశ, అమరచింత: వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టు, ఎన్టీఆర్ లెఫ్ట్ కెనాల్‌లో మొసలి సంచారం కలకలం రేపింది. జూరాల ప్రాజెక్టు ఎన్టీఆర్ లెఫ్ట్ ద్వారా అమరచింత, ఆత్మకూర్ పరిసర ప్రాంతాల రైతులకు సాగు నీటిని సరఫరా ఇరిగేషన్ కాలువ వట్టిపోయింది. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తక్కువ కావడంతో ఎన్టీఆర్ కాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేసి నెల రోజులు గడిచింది. దీంతో కాలువ నీరు అడుగంటి పోయింది.
గుంతలు ఉన్న ప్రాంతంలో ఒకటి, రెండు ఫీట్ల మేర నీరు అక్కడక్కడ ఉండిపోయింది. అదే నీటిలో చిక్కుకున్న మొసలి ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ.. బుధవారం మూలమల్ల గ్రామస్తుల కంటపడింది. చాలా సేపు అది నోరు తెరుచుకుని కనిపించడం చూసేవారికి ఒకింత భయాన్ని కల్పించినప్పటికి, ఆహారం కోసం అది చేస్తున్న సంచారం చూపారులకు అయ్యో పాపం అనేలా చేసింది. అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకుని, సమీప ప్రాజెక్ట్ నీటిలో వదిలి దాని ప్రాణాలు కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.