‘ఇది లక్షల భక్తుల సమస్య’.. తిరుమల లడ్డూ వివాదం పై సీపీఐ నేత సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదం వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డూ(Tirumala laddu) వివాదం వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ ఘటన పై పలువురు మంత్రులు స్పందించి కల్తీ లడ్డూ తయారీని తీవ్రంగా ఖండిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) టీటీడీ లడ్డూ వివాదంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ( CPI Leader Narayana ) స్పందించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ లడ్డూ ప్రసాదం కల్తీ అనేది అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు. ధర్మారెడ్డి IDS అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పని చేశారని ఆరోపించారు. ఆయన టీటీడీ ఈవో గా ఉన్నప్పటికీ వైసీపీ నేతగా వ్యవహరించారని ఆరోపించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘటన లక్షల భక్తుల సమస్య అని చెప్పారు. లడ్డూ కల్తీ పై సుప్రీంకోర్టు విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వీలైనంత త్వరగా విచారణ జరపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వేలాది మంది రోజు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని, స్వామి వారి ప్రసాదం లడ్డూ కొనుగోలు చేస్తారని తెలిపారు. ఈ క్రమంలో లడ్డూ తయారీకి వాడే నెయ్యి పబ్లిక్ సెక్టర్‌లో ఉన్న డెయిరీకి ఇవ్వాలని సీపీఐ నేత నారాయణ తెలిపారు.