Srisailam Reservoir : జల కళ.. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న ప్రవాహం

వర్షాలకు కుందూనదికి జల కళ సంతరించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి సరైన వర్షాల్లేక నదిలో నీటి ప్రవాహం నిలిచి పోయింది.

Update: 2023-07-30 01:55 GMT

దిశ, కడప: వర్షాలకు కుందూనదికి జల కళ సంతరించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి సరైన వర్షాల్లేక నదిలో నీటి ప్రవాహం నిలిచి పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు కుందూ నదికి చేరుతోంది. రెండు రోజులుగా నదిలో నీటి ప్రవాహం కొనసాగుతోంది. చాపాడుకు సమీపంలో ఉన్న పెద్ద బ్రిడ్జి వద్ద శనివారం నదిలో నాలుగు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నట్లు జలవరుల శాఖ అధికారులు తెలిపారు.‌ ఇటీవల కాలంలో ఇంతటి వర్షం లేకపోవడం వల్ల నదిలో నీరు నిలిచి పోయింది. దీంతో పెన్నా తీర ప్రాంతాల్లో పసుపు, పత్తి, వేరుశనగ పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు.

కేసీ కెనాల్ రైతుల్లోనూ

కేసీ కెనాల్ రైతుల్లోనూ ‌సాగు నీటిపై ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటక, తెలంగాణ రాష్టాలతో పాటు రాష్ట్రంలో అల్పపీడనం ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టు నీరు విడుదల కావడంతో ఆక్కడ నుంచి శ్రీశైలం జలాశయంలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. దాదాపు 2.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.

జలాశయం క్రమేణా పెరుగుతూ వస్తోంది. ఇదే నీటి ప్రవాహం కొనసాగుతే వారం రోజుల్లో డ్యామ్ పూర్తి స్థాయిలో నిండుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ తరువాత శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో తగినంతగా వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై రైతుల్లో అలజడి నెలకొంది. వర్షాల రాకతో ఒక్కసారిగా వారిలో ఆనందం వెల్లివిరిస్తోంది.

Tags:    

Similar News