నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు.. ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి చేసింది శూన్యమని, రాబోయే ఎన్నికల్లో హిందూపూర్‌ను కైవసం చేసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-01-10 11:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి చేసింది శూన్యమని, రాబోయే ఎన్నికల్లో హిందూపూర్‌ను కైవసం చేసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హిందూపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా రెండు సార్లు బాలకృష్ణ ఎన్నికైనా నియోజకవర్గంలోని సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నేతలు పాకులాడుతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అన్ని సర్వేలు సంస్థలు తమకు అనుకూలంగా తీర్పును వెలువరించాయని గుర్తు చేశారు.

తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఓటమి భయంతో చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని వెతుక్కుంటున్నారని తెలిపారు. ఒకవేళ ఆయన నియోజవర్గంలో మారితే నైతికంగా తమ చేతిలో ఓడినట్లేనని పేర్కొన్నారు. ఈ రోజుకి కూడా 175 నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేరని అన్నారు. తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పటిష్టంగా లేదని, ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షులను మార్చినా.. తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కోలుకునే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 

Tags:    

Similar News