నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.50వేలు పరిహారం ఇవ్వాలి: పురంధేశ్వరి
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కనీసం పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్లలో దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని పురంధేశ్వరికి రైతులు మెరపెట్టుకున్నారు. ఆరుకాలం పండించిన పంట చేతికందివచ్చే సమయానికి తుఫాను ఇలా బీభత్సం సృష్టించిందని వాపోయారు. ఇప్పటి వరకు తమను పలకరించిన నాదుడే లేరని దగ్గుబాటి పురంధేశ్వరి వద్ద రైతులు మెురపెట్టుకున్నారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంత్రులు రైతులను పరామర్శించకపోవడంపై మండిపడ్డారు.రైతు భరోసా కేంద్రాలు నామమాత్రంగా తయారయ్యాయని మండిపడ్డారు. కల్లాల్లో తడిసిన ధాన్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని తెలిపారు. తడిసిన ధాన్యం కొంటామని రైతులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి అని దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. అంతేకాదు రంగు మారిన, తడిసిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలి అని ప్రభుత్వాన్ని దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు.