పాలస్తీనాది స్వతంత్ర పోరాటం....ఉగ్రవాదంతో పోల్చడం సరికాదు: సీపీఎం నేత బీవీ రాఘవులు

పాలస్తీనా ప్రజలది దేశం కోసం జరిగే స్వతంత్ర పోరాటమని, దాన్ని ఉగ్రవాద చర్యతో పోల్చడం సరికాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబి, బీవీ రాఘవులు తెలిపారు.

Update: 2023-11-23 13:11 GMT


దిశ, డైనమిక్ బ్యూరో :

పాలస్తీనా ప్రజలది దేశం కోసం జరిగే స్వతంత్ర పోరాటమని, దాన్ని ఉగ్రవాద చర్యతో పోల్చడం సరికాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబి, బీవీ రాఘవులు తెలిపారు. విజయవాడలో గురువారం బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రచురించిన ‘పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ యుద్ధం’ బుక్‌లెట్‌ను వారు ఆవిష్కరించారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులు జరుపుతోందని, దాన్ని అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు సమర్థించడం, రెచ్చగొట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. భారతదేశం తొలి నుండీ పాలస్తీనాకు సంఫీుభావంగా నిలిచిందని... ఇప్పుడు ప్రధాని ఇజ్రాయెల్ దాడి చేయడం సరికాదంటున్నారు తప్ప ఆపాలని కోరడం లేదని విమర్శించారు. గతంలో జర్మనీలో హిట్లర్ ఎలాంటి ఊచకోతకు పాల్పడ్డారో అలాంటి చర్యకు ఇప్పుడు గాజాలో ఇజ్రాయిల్ అలా చేస్తోందని ఆరోపించారు. చరిత్రలో అక్కడ పాలస్తీనా మాత్రమే ఉందని, అనంతరం ఇజ్రాయిల్‌ను ఏర్పాటు చేశారని.. ఇప్పుడు పాలస్తీనానే లేకుండా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ నెలవరకూ ఇజ్రాయిల్ సాయుధులు 248 మంది పాలస్తీనా ప్రజలను కాల్చి చంపారని... అందులో 40 మంది పిల్లలు కూడా ఉన్నారని దీన్నెవరూ ప్రశ్నించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను భరించలేని పాలస్తీనాలోని హమాస్ బాంబుదాడికి దిగితే దాన్ని సాకుగా చూపి ఇప్పుడు పాలస్తీనా ప్రజలపై మారణహోమం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రులపైనా దాడులకు దిగుతున్నారని... దీన్ని ప్రపంచంలో అన్ని దేశాలూ వ్యతిరేకించాలని కోరారు. ఇజ్రాయిల్ విషయంలో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసే నాటికి ఎక్కువమంది పాలస్తీనా ప్రజలు ఉన్నారని... అధికభాగం భూమి వారి చేతిలోనే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆక్రమణలోకి వెళ్లిందని తెలిపారు. ఉన్నకొద్దిపాటి భూమిని కూడా ఆక్రమించేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబి, బీవీ రాఘవులు ఆరోపించారు.

అందుకే మోడీ నోరెత్తడం లేదు

ఇజ్రాయిల్ అనుసరిస్తున్న ఫాసిస్టు పద్దతులకు ఆర్ఎస్ఎస్ పద్ధతులూ ఒకేలా ఉన్నాయని.. అందువల్లే ఇజ్రాయిల్ దాడులపై మోడీ నోరెత్తడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబి, బీవీ రాఘవులుధ్వజమెత్తారు. విశ్వగురువు అని చెప్పుకుంటూ ఇజ్రాయిల్ యుద్ధనేరాలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. పాలస్తీనాలో అమాయకులను చంపడం బాధాకరమని, స్థానికంగా జరుగుతున్న యుద్ధం ఆ ప్రాంతమంతా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పడం వరకే మోడీ పరిమితం అవుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా అక్కడ కాల్పుల విరమణకు భారతదేశం డిమాండ్ చేయాలని, వైద్య సాయం అందించేలా చూడాలని ఇజ్రాయిల్ దురాక్రమణ నుండి పాలస్తీనాను విముక్తి చేయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా అదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు 7న జరిగిన ఘటన ఇజ్రాయిల్ దురాక్రమాలవల్లే జరిగిందని అక్కడి మీడియా కూడా ప్రస్తావించిందని తెలిపారు. అయినా అమెరికా నిస్సిగ్గుగా దాడులకు వంతపాడుతోందని విమర్శించారు. ఇజ్రాయిల్ యుద్ధం ఆగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం పడుతుందని, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారని, అటువంటప్పుడు యుద్ధాన్ని ఆపేదిశగా ఎందుకు ప్రయత్నించడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబి, బీవీ రాఘవులు ప్రశ్నించారు.

కరువు మండలాల్లో సహాక చర్యలు లేవు

రాష్ట్రంలో కరువు మండలాలుగా ప్రకటించిన వాటిల్లోనూ ఇప్పటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు తీసుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు విమర్శించారు. కృష్ణా డెల్టాలోనూ పంటలు వేయలేదని, వీటిని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కళ్లు మూసుకుని అంతా బావుందని చెబితే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. కరువు పరిశీలనకు కేంద్రం కూడా ఇంతవరకు బృందాలను పంపలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో కరువులేదు అంతా సుభిక్షంగా ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు అన్నారు.

Tags:    

Similar News